రెండు రోజుల క్రితం తమకు మాస్కులు లేవని అడిగిన విశాఖ జిల్లా నర్సీపట్నం వైద్యుడు సుధాకర్ పై సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే. నగరిలో నాలుగు కరోనా కేసులున్నా, ప్రభుత్వం నుంచి నిధులు రావడంలేదని, అకౌంట్లను సీజ్ చేశారంటూ మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి ఓ వీడియోలో తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఏపీ సర్కారు ఆయనపై కూడా సస్పెన్షన్ వేటు వేసింది. ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు.
మాస్కులు అడిగినందుకు నిన్న ఓ డాక్టర్ ను సస్పెండ్ చేశారని, ఇప్పుడు నగరి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి కూడా అదే ఫలితాన్ని చవిచూశారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మాస్కులు అడిగితే వేటు వేస్తారా? అంటూ మండిపడ్డారు. కరోనా మహమ్మారిపై ముందు నిలిచి పోరాడుతున్న వైద్యులు, ఇతర సిబ్బంది మాస్కులు, రక్షణ ఉపకరణాలు లేక నిస్సహాయుల్లా మిగిలిపోతున్నారన్నారు. ఏపీ సర్కారు వెంటనే పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. ఎలాంటి రక్షణ లేకుండా కరోనా రోగులకు సేవలందిస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్యసిబ్బంది పట్ల జగన్ మరింత మానవత్వం ప్రదర్శించాలని కోరారు.
పరిపాలించడం చేతకాకే… బీజేపీపై టీఆర్ఎస్ విమర్శలు: బాబు మోహన్