తెలంగాణ వైఎస్ఆర్ టిపి పార్టీ అధినేత వైఎస్ షర్మిల తన ట్విటర్ వేదికగా ఆసక్తి కర ట్వీట్ చేశారు. తాను ఒంటరిని అయ్యానని.. అయినా విజయం సాధించాలని… అవమానాలెదురైనా ఎదురీదాలని నిర్ణయం తీసుకున్నానని భావోద్వేగ ట్వీట్ చేసింది వైఎస్ షర్మిల. కష్టాలెన్నైనా ధైర్యంగా ఎదురుకోవాలని… ఎప్పుడూ ప్రేమనే పంచాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు.
తన వెన్నంటి నిలిచి , ప్రోత్సహించి నన్ను మీ కంటిపాపలా చూసుకొన్నారని తన తండ్రి అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై ప్రశంసలు కురిపించారు వైఎస్ షర్మిల. నాకు బాధౌస్తే మీ కంట్లోంచి నీరు కారేదని… ఈ రోజు నా కన్నీరు ఆగనంటుందని ఎమోషనల్ అయింది వైఎస్ షర్మిల. ఐ లవ్ యు నాన్న.. మిమ్మల్ని నేను చాలా మిస్ అవుతున్నాను అంటూ వైఎస్ షర్మిల పేర్కొంది. కాగా ఇవాళ ఉదయం తన అన్న ఏపీ సిఎం జగన్ తో కలిసి..వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి వైఎస్ షర్మిల నివాళులు అర్పించిన సంగతి తెలిసిందే.
దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ ఘాట్ వద్ద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, వైఎస్‌ఆర్ తెలంగాణ అధ్యక్షురాలు షర్మిల కుటుంబసభ్యులు ప్రత్యేక ప్రార్ధనలు చేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్‌ను స్మరించుకుంటూ మౌనం పాటించారు. ఈ వర్ధంతి సందర్భంగా వైఎస్ షర్మిల చేసిన ట్వీట్ ఇప్పుడు మీడియా, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.
గత కొన్ని రోజులుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో షర్మిలకు విబేధాలు ఉన్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఇడుపులపాయలో ఇద్దరూ పక్కపక్కనే ఉన్నప్పటికీ ఒకర్ని ఒకరు పలకరించకోకపోవడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే.. సోదరుడు జగన్‌తో మనస్పర్థలున్నాయన్న విషయం ఎవరికైనా స్పష్టంగానే అర్థమైపోతుంది. ఈ ట్వీట్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కూడా చర్చనీయాంశమవుతోంది.
ఒంటరి దానినైనా విజయం సాధించాలని,
అవమానాలెదురైనా ఎదురీదాలని,
కష్టాలెన్నైనా ధైర్యంగా ఎదురుకోవాలని,
ఎప్పుడూ ప్రేమనే పంచాలని,
నా వెన్నంటి నిలిచి, ప్రోత్సహించి
నన్ను మీ కంటిపాపలా చూసుకొన్నారు.
నాకు బాధొస్తే మీ కంట్లోంచి నీరు కారేది.
ఈ రోజు నా కన్నీరు ఆగనంటుంది.
I Love & Miss U DAD— YS Sharmila (@realyssharmila) September 2, 2021