telugu navyamedia
సినిమా వార్తలు

నందమూరి హ‌రికృష్ణ 65వ జయంతి

సినీన‌టుడు దివంగ‌త నందమూరి హ‌రికృష్ణ 65వ జయంతి నేడు. ఎన్టీఆర్ తన తనయుల్లో మూడవవాడైన హరికృష్ణను బాలనటునిగా ‘శ్రీకృష్ణావతారం’లోనే పరిచయం చేశారు. ఆ తరువాత మరికొన్ని చిత్రాలలో నటించినా, ‘డ్రైవర్ రాముడు’తో నిర్మాతగా మారారు హరికృష్ణ. అప్పటి నుంచీ చిత్ర నిర్మాణంపైనే దృష్టిని కేంద్రీకరించిన హరికృష్ణ దాదాపు 21 సంవత్సరాలకు మళ్ళీ కెమెరా ముందుకు వచ్చారు. పలు సినిమాల్లో హరికృష్ణ హీరోగానూ విజయాలను సాధించారు.

రాజకీయాల్లోనూ హరికృష్ణ తనదైన పాత్ర పోషించారు. తండ్రి ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన హిందూపూర్ నియోజకవర్గం నుండి 1996లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతకు ముందు చంద్రబాబు మంత్రివర్గంలో ట్రాన్స్ పోర్ట్ మినిష్టర్ గానూ పనిచేశారు. 2008లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు.

తమ్ముడు బాలకృష్ణ హీరో అయిన తరువాత “పట్టాభిషేకం, అనసూయమ్మగారి అల్లుడు, తిరగబడ్డ తెలుగుబిడ్డ, పెద్దన్నయ్య” వంటి చిత్రాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ఆయన హీరోగా నటించిన ‘లాహిరి లాహిరి లాహిరిలో…’, ‘సీతయ్య’ మంచి విజయం తో హరికృష్ణకు స్టార్ డమ్ లభించింది. “టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, స్వామి” వంటి చిత్రాల్లోనూ హరికృష్ణ నటునిగా మురిపించారు.

హరికృష్ణకు ముగ్గురు కుమారులు జానకిరామ్, కళ్యాణ్ రామ్, తారకరామ్. వీరిలో కళ్యాణ్, తారక్ ఇద్దరూ నటనలో రాణిస్తున్నారు. వీరిద్దరితో కలసి హరికృష్ణ నటిస్తారని చాలా రోజులు వినిపించింది . అయితే అది కార్యరూపం దాల్చలేదు. ఆయన పెద్ద కొడుకు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. తరువాత నాలుగేళ్ళకే హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలోనే మరణించడం విచారకరం. నేడు ఆయన జయంతి సంద‌ర్భంగా ఆయ‌న‌ను గుర్తు చేసుకుంటూ ప‌లువురు రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖులు నివాళులు అర్పించారు.

Related posts