సూపర్‌స్టార్ మహేష్ హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన `సరిలేరు నీకెవ్వరు` సినిమాతో విజయశాంతి రీ-ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఇటీవల సంక్రాంతికి విడుదలై విజయం సాధించింది. ఆ సినిమాలో విజయశాంతి ఓ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించి మెప్పించారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత వెండితెరపై కనిపించి తనదైన నటనతో అలరించారు సీనియర్ నటి విజయశాంతి. ఇకపై మరిన్ని సినిమాల్లో విజయశాంతి నటిస్తారని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పట్లో మరో సినిమాలో నటించే ఉద్దేశం విజయశాంతికి లేదు. ఆ మేరకు తన ట్విటర్ ఖాతాలో విజయశాంతి ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. “సరిలేరు మీకెవ్వరుతో ఇంత గొప్ప విజయాన్ని నాకు అందించి, నన్ను ఎల్లప్పుడూ ఆదరిస్తూ వస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. `కళ్ళుకుల్ ఇరమ్`, `కిలాడి కృష్ణుడు` నుంచి నేటి `సరిలేరునీకెవ్వరు` వరకు నన్ను ఆదరించి గౌరవించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ప్రజా జీవన పోరాటంలో నా ప్రయాణం.. మళ్లీ మరో సినిమా చేసే సమయం, సందర్భం నాకు కల్పిస్తోందో, లేదో నాకు కూడా తెలియదు. ఇప్పటికి ఇక శెలవు. మనసు నిండిన మీ ఆదరణకు, నా ప్రాణప్రదమైన అభిమాన సైన్యానికి ఎప్పటికీ నమస్సులు -మీ విజయశాంతి” అంటూ విజయశాంతి వరుస ట్వీట్లు చేశారు.
previous post
next post

