ప్రముఖ తెలుగు రచయిత్రి తుర్లపాటి రాజేశ్వరి ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారాన్ని అందుకున్నారు.
ప్రఖ్యాత ఒడియా రచయిత గోపీనాథ్ మహంతి రచించిన ‘దాడిబుధ’ నవలను ‘ఈతచెట్టు దేవుడు’ పేరుతో ఆమె తెలుగులోకి అనువదించినందుకు గాను ఈ గౌరవం దక్కింది.
కోల్‍కతాలోని జాతీయ లైబ్రరీలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారాన్ని స్వీకరించారు.
ఈ పురస్కారం కింద రాజేశ్వరికి రూ. 50 వేల నగదు, తామ్రపత్రం అందజేసి సత్కరించారు. ఈ నవల ఒడిశాలోని కోరాపుట్ జిల్లా లుల్లా అనే గిరిజన గ్రామం నేపథ్యంలో సాగుతుంది.
అటవీ ప్రాంతంలో వన్యమృగాల భయం మధ్య జీవించే గిరిజనుల జీవనశైలి, వారి సంస్కృతి, నమ్మకాలను ఈ నవలలో రచయిత కళ్లకు కట్టినట్టు చూపించారు.
1947 ఆగస్టు 10న ఆంధ్రప్రదేశ్‍లోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో తుర్లపాటి రాజేశ్వరి జన్మించారు. గత ఐదు దశాబ్దాలుగా ఆమె ఒడిశాలోని బరంపురంలో నివసిస్తూ, ఒడియా సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు పరిచయం చేస్తున్నారు.
ఆమె కవిత్వం, పరిశోధనా వ్యాసాలతో పాటు అనేక ఒడియా రచనలను తెలుగులోకి అనువదించి మంచి పేరు సంపాదించారు.
ఈ సందర్భంగా కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కృత్తివెంటి శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాజేశ్వరి చేసిన అనువాదం చాలా సరళంగా, మూల రచనలోని జీవం చెడకుండా, అందరికీ అర్థమయ్యే శైలిలో ఉందని ప్రశంసించారు.

