వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
రాష్ట్రం విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులేస్తుంటే, ప్రగతిని అడ్డుకునేలా మాట్లాడటం జగన్ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు.
ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన వ్యక్తి, కాంట్రాక్టర్లను జైలుకు పంపుతానంటూ బెదిరింపులకు దిగడం తగదని హితవు పలికారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు వంటి సీనియర్ నేతను ఏకవచనంతో సంబోధించడం ఆయన స్థాయిని మరింత దిగజార్చుతోందని విమర్శించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
“అధికారంలోకి వస్తే మెడికల్ కాలేజీలను దక్కించుకున్న కాంట్రాక్టర్లను, నిర్వాహకులను రెండు నెలల్లో జైలుకు పంపుతానంటూ బెదిరింపులకు దిగడం ముఖ్యమంత్రి హోదాలో పని చేసిన వ్యక్తికి ఏమాత్రం తగదు.
దేశ రాజకీయాల్లో ఎంతో సీనియరైన, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఏకవచనంతో సంబోధించడం, చంద్రబాబు గారి మాటలు విన్న కలెక్టర్లు తలలు బండకేసి బాదుకోవాలి అంటూ అభ్యంతర వ్యాఖ్యానాలు చేయడం తీవ్ర ఆక్షేపణీయం.
రుషికొండ ప్యాలెస్ కోసం రూ.453 కోట్లు ఖర్చు చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడా మొత్తం రూ.240 కోట్లేనని బుకాయించడం ఆయన రెండు నాల్కల ధోరణికి నిదర్శనం.
రూ.7 కోట్ల ఆదాయం వచ్చే టూరిజం భవనాలను వైసీపీ హయాంలో కూలగొట్టారు.
ప్రత్యేకంగా తన కుటుంబం కోసం ప్యాలెస్ కట్టుకోవడానికి వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినందుకు ప్రశ్చాతాపం చెందకుండా,
“రుషికొండ ప్యాలెస్ బ్రహ్మాండమైన భవనం, విశాఖకు తలమానికం ప్రత్యేక ఆకర్షణ “అంటూ గొప్పలు చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే” అని గంటా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

