కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి అనారోగ్యంతో నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సన్నిహితుడు, కర్ణాటక అసెంబ్లీ మాజీ స్పీకర్ రమేశ్ కుమార్ ఈరోజు జైపాల్ రెడ్డి అంత్యక్రియలకు హాజరయ్యారు. జైపాల్ రెడ్డి భౌతికకాయాన్ని చూడగానే ఆయన కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం పీవీ ఘాట్ సమీపంలో అంత్యక్రియల్లో పాల్గొని జైపాల్ రెడ్డి పాడెను స్వయంగా మోశారు. ఆయనతో పాటు కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య కూడా జైపాల్ రెడ్డి పాడెను మోశారు. ఈ కార్యక్రమం సాగుతున్నంతసేపు రమేశ్ కుమార్ కన్నీరు పెడుతూనే ఉన్నారు.
బెంగళూరులో నిన్న మీడియా సమావేశం సందర్భంగా జైపాల్ రెడ్డి చనిపోయారని రమేశ్ కుమార్ కు తెలిసింది. దీంతో తీవ్ర భావోద్వేగానికి లోనైన ఆయన.. జైపాల్ తో తనది 40 ఏళ్ల అనుబంధమని తెలిపారు. జైపాల్ రెడ్డి తనకు పెద్దన్నలాంటి వారనీ, తనకు మార్గదర్శిగా వ్యవహరించారని పేర్కొన్నారు. నిన్న 14 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ హోదాలో అనర్హత వేటు వేసిన రమేశ్ కుమార్ ఈరోజు ఉదయం తన స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. అనంతరం ప్రత్యేక విమానంలో జైపాల్ రెడ్డి అంత్యక్రియలకు హాజరయ్యారు.