telugu navyamedia
తెలుగు కవిత్వం సామాజిక

నా దోసిట్లో పడ్డ కొన్ని శ్రీరమణ గారి సింహాచలం సంపగలు – రచయిత ఆకెళ్ల శివ ప్రసాద్

Writer Sri Ramana2023లో చిత్ర సీమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఒక్కొక్కరుగా ఈ లోకాన్ని విడిచిపోతున్నారు. తాజాగా మిథునం కథా రచయత శ్రీరమణ అనారోగ్యంతో కన్నుమూసారు.  ఈయన వయసు 71 యేళ్లు. ముఖ్యంగా వ్యంగ్య రచనలకు ఈయన పేరు ప్రఖ్యాతలు పొందారు. సినిమాగా తెరకెక్కిన మిథునం కథా రచయతగా ఈయన పాపులర్ అయ్యారు. ముఖ్యంగా పలు పత్రికల్లో వ్యంగ్య హాస్య భరతమైన కథా రచయతగా.. కాలమిస్టుగా, కథకుడిగా.. సినిమా నిర్మాణ నిర్వహణలో సుప్రసిద్ధుడు. ఈయన ‘ప్రతిక’ అనే మాస పత్రికకు గౌరవ సంపాదకుడిగా వ్యవహరించారు. ఆయన హాస్య రచన విభాగంలో తెలుగు యూనివర్సిటీ నుంచి 2014లో కీర్తి పురస్కారాన్ని అందుకున్నారు. ముఖ్యంగా నవ్య ావార పత్రిక ఎడిటర్‌గా ఈయన పాపులర్ అయ్యారు.

రచయిత ఆకెళ్ల శివ ప్రసాద్  గారి శ్రీరమణ తో అనుభవాలు

1998లో శ్రీరమణ గారితో ముఖాముఖి పరిచయం .
ఆంధ్రప్రభ వారపత్రిక లో చేసేవారు. అప్పట్లో పంచ కళ్యాణి అనే పేరు మీద ఐదు వారాల చిన్న నవలలు ప్రచురించాలని సంకల్పించారు. నేను కలిసినప్పుడు నన్ను రాయమన్నారు .
నవ్వుతూ,తనదైన శైలిలో “ఆంధ్రప్రభ అంటే రంగయ్య మాస్టారు చేతికర్ర తీసుకుని బడికి బయలుదేరారు అని మొదలు పెట్టకండి సార్.. లైట్ గా ఉండాలి.. హాయిగా చదివించేయాలి “అన్నారు.
క్షేత్రపాలకులు వారు. సరేనని తలూపి, అప్పట్లో ఆంధ్రప్రభ లోయర్ ట్యాంక్ బండ్లో ఉండేది.
క్యాంటిన్ లో టీ తాగుతూ సరదాగా నేను” జంట నగరాలని ట్యాంక్ బండి కలుపుతుందిగా.. ఈ ట్యాంక్ బండి మీద విగ్రహాల చుట్టూ స్టోరీ రాస్తాను” అన్నాను.
“ సరే మీ ఇష్టం” అని ఒప్పుకుని ఎప్పట్లాగే తనదేనా మార్కు నవ్వుతో వార్నింగ్ ఇస్తున్నట్టుగా “ఎందుకైనా మంచిది.. ఓసారి ట్యాంక్ బండి పైకి వెళ్లండి.. లేని విగ్రహం గురించి రాస్తే తేడాలు వస్తాయి..” అన్నారు

ఓ వారం తర్వాత నవల తీసుకెళ్లాను.
పకలకరింపులు అయ్యాకా, నవల ‘ఏదీ’ అన్నారు.
నేను లేచి ప్యాంటు జేబులో మడిచిపెట్టిన కాగితాలను తీసి ఆయన టేబుల్ మీద పెడుతుంటే
“ మేమే అడిగినా బొత్తిగా ఇలా తీసుకోవడం బాగోలేదు..” అని నవ్వి, తనదగ్గరున్న ఫైల్ లో పెట్తుకున్నారు.

అప్పటినుంచి ఎప్పుడు కనిపించినా “ సరదాగా ఆ వెనక జేబులోంచి ఒక కధ తీసి ఇస్తారేంటి అంటూ ఆటపట్టించేవారు.

ఆ తర్వాత 2010లో మహా టీవీలో పనిచేస్తున్నప్పుడు నా కథల సంపుటి “కిటికీ లోంచి వాన”కి ముందుమాట రాయమని అడిగినప్పుడు “ఈమధ్య అందరూ నన్ను పె ద్దమనిషి నిచేస్తున్నారు ..చాలామంది ముందు మాట రాయమంటున్నారు .. కధలు రాయమనట్లేదు అని సరదాగా నవ్వేసి, యు ఆర్ ఇన్ క్యూ అన్నట్టుగా చూశారు. చిత్రంగా, అభిమానంతోను వారం రోజుల్లో అద్భుతమైన ముందు మాట’చదవదగిన నక్షత్రాలు’గా రాసేశారు.
ఆ సంపుటి లో ఉన్న ‘సరస్వతి లిపి’కి ఆయన నవ్య ఎడిటర్ గా ఉన్నప్పుడు బహుమతి ఇచ్చారు

2016లో అనుకుంటా.. భక్తి టివిలో పనిచేసేవారు.. భారతి కృష్ణ గారని నా మిత్రుడు.. ఓ పల్లె నేపథ్యంలో సినిమాకి కధ డెవలప్ చేద్దాం అంటే శ్రీరమణగారితో పనిచేయాలన్న, సంకల్పంతో శ్రీరమణ గారి దగ్గరికి వెళ్ళాము. ఆయన ఒప్పుకున్నారు. దాదాపు మూడు నెలలు ఆ కధా చర్చలు సాగాయి.
నిజం చెప్పాలంటే, కధ పూర్తవలేదు .కానీ ఎన్నో కొత్త విషయాలు, బోలెడు కబుర్లు చెప్పుకున్నాం .మేము పొద్దున్నే వెళ్ళిన వెంటనే శ్రీరమణ గారి శ్రీమతి గారు ఓ అద్భుతమైన టిఫిన్ చేస్తే ,అది హాయిగా కడుపునిండా తినేసి మంచి కాఫీ తాగేసి కథని మొదలు పెడుతుంటే, శ్రీరమణ గారు తనదైన శైలిలో ఓ పాయింట్ మీదో, పాత్ర మీదో అనర్ఘళంగా మాట్లాడేవారు.
ఆ కధ ఇప్పటికీ కంచికి చేరలేదు!
తర్వాత వెళ్ళినప్పుడ ల్లా ఎన్నో కబుర్లు ఎన్నో విశేషాలు.

ఆరు నెలలక్రితంఅనుకుంటా..
ఓసారి ఫోన్ చేద్దాం అని పించి చేశాను.
అటు వైపు నుంది భారంగా, ఆయసపడుతూ శ్రీరమణ గారి కంఠం…
అతి కష్ట మ్మీద మాట్లాడారు..
ఆ..తర్వాత మాట్లాడే ధైర్యం చేయలేదు..
కానీ అప్పటికే,మా ఇద్దరి మాటలలో.. కొన్ని వేల సింహాచలం సంపగలని నాకు ఇచ్చారు..
భారీ విరామాల తర్వాత ఇద్దరం పలు సందర్భాల్లో కలుసుకుని మాట్లాడుకున్నాం.
ఇప్పుడు ఎప్పటికీ పూరించుకోలేని భారీ విరామం వచ్చింది…
“ ఇదే జీవితమస్మి..” అని సింహాచలం సంపెంగపూలని విసురుతూ,, మొట్టికాయ వేస్తున్నట్టుగా ఉంది.
నా కధల సంపుటికి రాసిన ముందు మాట కాగితాలు అపురూపంగా దాచుకున్నాను. ఆ ఫోటో పెడుతున్నాను. ఎందుకంటే శ్రీరమణ గారి రచనలే కాదు ఆయన చేతిరాత కూడా అంత అద్భుతంగా ఉంటుంది కనుక..
ఆ రాత లోని ఆ అక్షరాల్లో కూడా సింహాచలం సంపంగి పరిమళాలు ఎప్పటికీ అందుతూనే ఉంటాయి కనుక….

Related posts