telugu navyamedia
సినిమా వార్తలు

సాహో : రూ.200 కోట్ల టికెట్ రూ.2000…!

Saaho

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం “సాహో”. సుజిత్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్పెష‌ల్ డ్యాన్స్‌తో అల‌రించ‌నుంది. బాలీవుడ్ నటులు నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ ఇతర కీలక పాత్రల్లో న‌టించారు. ఈ సినిమా ఈరోజు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ రేంజ్‌లో విడుదలైంది. “సాహో”ను మొదటిరోజు మొదటి ఆటకే చూసేయాలన్న ఉత్సాహం, ఆసక్తి అభిమానుల్లో రెట్టింపయ్యింది. అయితే ఇదే అదనుగా ఫ్యాన్స్‌ను దోచేసుకుంటున్నాయి కొన్ని థియేటర్ యాజమాన్యాలు. టికెట్స్‌ను బ్లాక్‌లో అమ్ముతూ వారి జేబులను గుల్ల చేస్తున్నాయి. రూ.200 టిక్కెట్‌ను రూ.2 వేలకు విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. టిక్కెట్ విక్రయాలపై పోలీసులు థియేటర్ యాజమన్యాలకు ఇప్పటికే లిఖితపూర్వక ఆదేశాలిచ్చారు. అలాగే ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలని, అనుమతి లేకుండా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేయవద్దని నోటీసుల్లో పేర్కొన్నారు. బ్లాక్ టిక్కెట్ విక్రయాలపై స్పష్టమైన ఆదేశాలిచ్చినప్పటికీ, కొన్ని థియేటర్ యాజమన్యాలు మాత్రం దాన్ని లెక్క చేయడం లేదు. కాగా హైకోర్టులో రిట్ దాఖలు చేసిన మేరకు టిక్కెట్ రేట్లు భారీగా పెరిగిపోయాయి. సినిమా అదనపు ప్రదర్శనలకు ప్రభుత్వం కూడా అనుమతినిచ్చింది. అర్థరాత్రి ఒంటి గంట నుంచి మరుసటిరోజు ఉదయం 10 గంటల వరకు ఎక్స్‌ట్రా షోలు వేసుకోవచ్చని అనుమతినిచ్చింది. దీంతో చాలా థియేటర్స్ బెనిఫిట్ షోలు సహా అదనపు షోలను ప్లాన్ చేసుకున్నాయి. మొత్తం మీద ఈ శుక్రవారం రాష్ట్రంలో “సాహో” సందడి స్పష్టంగా కనిపిస్తోంది. బాహుబలితో ప్రేక్షకులను మెప్పించిన ప్రభాస్.. మరి “సాహో”తో మెప్పించాడా ? లేదా…? అన్నది ఇంకా కొన్ని గంటల్లో తేలిపోనుంది.

Related posts