నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పునర్విభజన వల్ల జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలు నష్టపోయే అవకాశం ఉంటుందని అన్నారు.
ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలనే కొనసాగించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు పెంచాలని సభలో వ్యాఖ్యానించారు.
ప్రస్తుత జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ సీట్లను పెంచాలని డిమాండ్ చేశారు. జనాభా నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను దక్షిణాది రాష్ట్రాలు పాటించాయని, ఉత్తరాది రాష్ట్రాలు పాటించలేదని తెలిపారు.
ప్రస్తుతం పునర్విభజన జనాభా ప్రాతిపదికన జరుగుతోందని, అలా చేస్తే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని ముఖ్యమంత్రి అన్నారు.
జనాభా ప్రాతిపదికన చేసే నియోజకవర్గాల పునర్విభజనకు అంగీకరించేది లేదని ఇటీవల డీఎంకే నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో తీర్మానం చేసినట్లు చెప్పారు. జనాభా ఆధారంగా పునర్విభజనను వాజ్పేయి కూడా వ్యతిరేకించారని గుర్తు చేశారు.
ప్రస్తుతం లోక్ సభలో దక్షిణాది రాష్ట్రాలకు 24 శాతం ప్రాతినిథ్యం ఉందని, పునర్విభజన జరిగితే 19 శాతానికి పడిపోతుందని తెలిపారు. జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలు ఒకే మాటపై ఉండాలని అన్నారు.

