ఏపీలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు ప్రజలను అల్లల్లాడించాయి. జూన్ వచ్చినా ఈ ఎండతాపం తగ్గకపోవడం విశేషం. తాజాగా, నేడు రాష్ట్రంలో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కృష్ణా జిల్లా గన్నవరం పరిసరాల్లో, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల్లో భారీ వర్షం కురవగా, నందిగామలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. గుంటూరు జిల్లా మాచర్లలో ఈదురుగాలులతో కూడిన జల్లులు పడ్డాయి. రాజుపాలెం మండలంలో మబ్బులు కమ్ముకున్నాయి. నరసరావుపేటలో కూడా అదే పరిస్థితి నెలకొంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
సత్తెనపల్లి, పెదకూరపాడు, అమృతలూరులో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఈదురుగాలులకు కొబ్బరిచెట్లు నేల కూలాయి. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవనున్నట్టు ఆర్టీజీఎస్ పేర్కొంది. రేపటి నుంచి ఈ నెల 9 వరకు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్టు తెలిపింది. ఈ నెల 11, 12 తేదీల్లో రాయలసీమ జిల్లాలను, 13, 14 తేదీల్లో దక్షిణ కోస్తా ప్రాంతాలను రుతుపవనాలు తాకనున్నట్టు ఆర్టీజీఎస్ అధికారులు పేర్కొన్నారు.