బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) ఘనవిజయం సాధిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు.
అధికార ఎన్డీయే 160కి పైగా సీట్లలో గెలుస్తుందని, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలో తుదుపరి ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు.
ఇక్కడ నితీష్ కుమార్ సీఎం అని, అక్కడ నరేంద్ర మోదీ ప్రధాని అని, సీఎం సీటు కానీ పీఎం సీటు కానీ ఖాళీగా లేదని మంగళవారంనాడు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో అమిత్‌షా తెలిపారు.
బిహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వ్యక్తిగత దాడికి పాల్పడుతున్నారని అమిత్‌షా విమర్శించారు.
ఓట్ల కోసం మోదీ భరతనాట్యం చేయడానికి కూడా సిద్ధమేనని రాహుల్ మాట్లాడటం, పెళ్లి వేడుకలకు మోదీ ప్రచారం చేస్తున్నట్టు ఉందంటూ ఖర్గే వ్యాఖ్యానించడాన్ని తప్పుపట్టారు.
కాంగ్రెస్ నిరాశానిస్పృలతో ఉందనడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమని అన్నారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రజలకు చేరువకాలేదని, మోదీ కూడా అలాగే ఉండాలని కాంగ్రెస్ భావిస్తోందని అన్నారు.
మోదీ ఎందుకు ప్రచారం చేయకూడదని ప్రశ్నించారు. ఎన్నికలంటేనే ప్రజాస్వామ్య పండుగ అని, ప్రజలకు చేరువకావడం నాయకుడి కర్తవ్యమని చెప్పారు.
ఎన్నికలు వచ్చిన ప్రతిసారి మోదీపై వ్యక్తిగత విమర్శలు చేయడం కాంగ్రెస్ నేతలకు పరిపాటిగా మారిందని, ఇలా చేసిన ప్రతిసారి బీజేపీకి ప్రజలు ఘనవిజయం కట్టబెట్టారని, ఈసారి కూడా అదే జరుగుతుందని, కాంగ్రెస్‌కు భంగపాటు తప్పదని అన్నారు.

