telugu navyamedia
రాజకీయ వార్తలు

రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు

ఓట్ల విషయంలో ఆరు నెలల పాటు సొంతగా దర్యాప్తు జరిపి, అణుబాంబు లాంటి ఆధారాలను గుర్తించామని, ఆ బాంబు పేలిన రోజు ఎన్నికల సంఘం దాక్కోవడానికి కూడా అవకాశం ఉండదని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను చేపట్టారు. అనంతరం ముసాయిదా ఓటరు జాబితాను ఈసీ ఈరోజు విడుదల చేసింది.

ఈ ప్రక్రియను రాహుల్ గాంధీ మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. తాజాగా, కేంద్ర ఎన్నికల సంఘంపై ఆయన మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ కోసం ఈసీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు. దానిని రుజువు చేయడానికి తమ వద్ద అణుబాంబు వంటి ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.

రాష్ట్ర స్థాయి నుంచి ఓట్ల దొంగతనం జరుగుతోందని ఎప్పటి నుంచో అనుమానిస్తున్నామని, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో కూడా అక్రమాలు జరిగాయని రాహుల్ గాంధీ ఆరోపించారు.

కోట్లాది మంది కొత్త ఓటర్లను అదనంగా చేరుస్తున్నారని ఆయన అన్నారు. ఇది దేశద్రోహం కంటే తక్కువేమీ కాదని ఆయన వ్యాఖ్యానించారు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఏ ఒక్కరినీ వదిలి పెట్టేది లేదని వ్యాఖ్యానించారు.

అధికారులు రిటైర్ అయినా వదిలి పెట్టేది లేదని తేల్చి చెప్పారు.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఈసీ ఖండించింది. నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, ఇలా రోజూ వచ్చే బెదిరింపులను తాము పట్టించుకోబోమని తెలిపారు.

రాహుల్ గాంధీ వంటి నేతల బాధ్యతారాహిత్య వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తమ అధికారులకు స్పష్టం చేశామని ఈసీ పేర్కొంది.

పారదర్శకంగా పనిచేస్తూ ఆరోపణలను విస్మరించాలని సూచించింది.

Related posts