telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

మహిళల గౌరవాన్ని పెంచేలా తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది: మంత్రి లోకేశ్

నేడు కృష్ణా జిల్లా మచిలీపట్నం పర్యటనకు విచ్చేసిన మంత్రి లోకేశ్ కు మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాశ్‌, పార్లమెంట్ సభ్యులు బాలశౌరి, శాసనసభ్యులు బోడె ప్రసాద్, వర్ల కుమార్ రాజా, వెనిగండ్ల రాము, కాగిత కృష్ణప్రసాద్‌లతో పాటు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికాయి.

ఈ సందర్భంగా తెలుగు మహిళలు మంత్రి లోకేశ్‌కు హారతి ఇచ్చి ఆశీర్వదించారు.

పిల్లల చదువుల కోసం ఏ తల్లీ ఇబ్బంది పడకూడదన్న సదుద్దేశంతోనే “తల్లికి వందనం” పథకాన్ని అమలు చేస్తున్నామని లోకేశ్‌ తెలిపారు.

ఈ పథకం అమలు చేయడం పట్ల మహిళలు ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.

గత వైసీపీ ప్రభుత్వంలో మహిళలను కించపరిచే విధంగా నాయకులు ఎలా మాట్లాడారో ప్రజలందరూ గమనించారని ఆయన గుర్తుచేశారు.

అయితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మహిళలకు త‌గిన గౌరవం లభిస్తుందని అన్నారు.

సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా మహిళలతో మాట్లాడే తీరులో మార్పు రావాలని లోకేశ్ తెలిపారు.

ఈ మార్పు కేవలం చట్టాలు చేయడం ద్వారానో, డబ్బులు పంచడం ద్వారానో సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు.

త్వరలోనే పాఠశాలల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలు (పేరెంట్స్-టీచర్స్ మీటింగ్స్) నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.

తన సతీమణి బ్రాహ్మణి సహకారం లేకపోతే తాను ఏ కార్యక్రమాన్నీ విజయవంతంగా నిర్వహించలేనని లోకేశ్‌ అన్నారు.

అలాగే తన తల్లి భువనేశ్వరి ఎంతో త్యాగం చేయడం వల్లే, తండ్రి చంద్రబాబు రాష్ట్రానికి సేవ చేయగలుగుతున్నారని పేర్కొన్నారు.

మహిళల గౌరవాన్ని పెంచేలా తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని మంత్రి లోకేశ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Related posts