తెలంగాణ స్థానిక సమరానికి షెడ్యూల్ విడుదలవడంతో, కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, డీసీసీ అధ్యక్షులతో అత్యవసర సమావేశం నిర్వహించి గెలుపే లక్ష్యంగా దిశానిర్దేశం చేశారు.
అక్టోబర్ 5 నాటికి ప్రతి జెడ్పీటీసీ స్థానానికి ముగ్గురు బలమైన అభ్యర్థులను గుర్తించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మంత్రులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులతో జూమ్ ద్వారా అత్యవసర సమావేశం నిర్వహించి, అభ్యర్థుల ఎంపికపై కీలక సూచనలు చేశారు.
నామినేషన్ల స్వీకరణ ప్రారంభమయ్యే లోపే అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలని పార్టీ యోచిస్తోంది. జడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల పేర్ల జాబితాలను అక్టోబరు 5వ తేదీ నాటికి పీసీసీకి పంపాలని మంత్రులు, డీసీసీ అధ్యక్షులకు సీఎం ఆదేశించారు.
ప్రతి జెడ్పీటీసీ స్థానం నుంచి గెలిచే అవకాశాలున్న ముగ్గురు బలమైన, అర్హులైన అభ్యర్థులను గుర్తించాలని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులతో తప్పనిసరిగా సంప్రదించాలని సూచించారు.
అన్ని రకాలుగా పరిశీలించిన అనంతరం గెలిచే అవకాశాలున్న అభ్యర్థులను అక్టోబరు 6, 7 తేదీల్లో పీసీసీ ఎంపిక చేసి తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
ఎక్కడా చిన్న పొరపాటుకు కూడా తావివ్వకుండా.. గెలుపే లక్ష్యంగా నాయకులంతా సమష్టిగా పనిచేయాలని సీఎం మంత్రులకు సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మహా లక్ష్మి, గృహ జ్యోతి, ఇంద్రమ్మ ఇళ్లు, బీసీ రిజర్వేషన్ల జీఓ వంటివి అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని రేవంత్‌రెడ్డి సూచించారు.
సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ తదితరులు పాల్గొన్నారు.