telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన తెలంగాణ ప్రభుత్వం, హర్షం వ్యక్తం చేసిన కల్వకుంట్ల కవిత

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వాగతించారు.

ఈ మేరకు గురువారం ఆమె ‘ఎక్స్’ వేదికగా తన స్పందనను తెలియజేస్తూ ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాన్ని సవరించి బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న ప్రభుత్వ వైఖరిని ఆమె ప్రశంసించారు.

ఈ దిశగా అవసరమైన చర్యలను ప్రభుత్వం తక్షణమే ప్రారంభించాలని ఆమె కోరారు.

ఈ నిర్ణయం తెలంగాణలోని బీసీల విజయమని కవిత అభివర్ణించారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ జాగృతి సంస్థ మొదటి నుంచి బలంగా డిమాండ్ చేస్తోందని, కేబినెట్ తాజా నిర్ణయం తమ పోరాటానికి లభించిన స్పష్టమైన విజయమని ఆమె పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కవిత జై బీసీ, జై జాగృతి అనే నినాదాలను తన ట్వీట్ కు ట్యాగ్ చేశారు.

Related posts