telugu navyamedia
ఆంధ్ర వార్తలు

కడప మహానాడు: ప్రభుత్వ కొనసాగింపు, అభివృద్ధి ప్రయోజనాలు, “మై టీడీపీ యాప్” ఆవిష్కరణ

కడప మహానాడును గతంలో ఎన్నడూ జరగని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించనున్నారు. మొదటి రోజు పార్టీ ప్రతినిధుల సభ, పార్టీ విధివిధానాలు, సిద్ధాంతాలు, కార్యాచరణపై కేడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు. రెండో రోజు ప్రతినిధుల సభతో పాటు కూటమి ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన ముసాయిదా తీర్మానాలపై చర్చించనున్నారు. మహానాడు 3వ రోజు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

ప్రభుత్వ కొనసాగింపు ఆవశ్యకతను వివరించనున్న నేతలు

రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం నిరంతరాయంగా అధికారంలో కొనసాగడం వల్ల రాష్ట్రంలో జరిగే అభివృద్ధి, ప్రజలకు కలిగే ప్రయోజనాలను మహానాడు వేదికగా నేతలు ప్రజలకు వివరించనున్నారు. గుజరాత్ లో గత మూడు దశాబ్దాలుగా బీజేపీ అధికారంలో ఉండటం వల్ల ఆ రాష్ట్రంలో సుస్థిర అభివృద్ధి సాధ్యమైంది. గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ వరుసగా 7 సార్లు విజయం సాధించింది. దీంతో గుజరాత్ మనదేశంలో అత్యంత ప్రగతిశీల, అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. సరైన సమయంలో సరైన నాయకత్వంతో పాటు ప్రభుత్వ కొనసాగింపు వల్లే ఇది సాధ్యమైంది. అదేవిధంగా ఒడిశాలో బిజూ జనతాదళ్ ఐదు సార్లు వరుసగా విజయం సాధించింది. ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ 24 ఏళ్లు పదవి కాలంలో ఒడిశా రాష్ట్రం అనేక రంగాల్లో విప్లవాత్మకమైన వృద్ధిని సాధించింది. మన రాష్ట్రంలోనూ ప్రభుత్వ కొనసాగింపు వల్ల స్వర్ణాంధ్ర కల సాకరానికి మార్గం సుగమం అవుతుందని నేతలు వివరించనున్నారు.

పార్టీకి, ప్రజలకు మధ్య సంధానకర్తగా “మై టీడీపీ యాప్” ఆవిష్కరణ

పార్టీకి ప్రజలకు మధ్య అనుసంధానానికి మహానాడు వేదిక ద్వారా “మై టీడీపీ యాప్” ను ఆవిష్కరించనున్నారు. ఈ యాప్ ద్వారా పార్టీ కార్యకర్తల నుంచి పొలిట్ బ్యూరో సభ్యుడి వరకు వారి పనితీరును సాంకేతిక పరిజ్ఞానం సాయంతో బేరీజు వేయనున్నారు. ఎవరెవరు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. ఎవరు ఎంత కష్టపడుతున్నారో ఈ యాప్ ద్వారా నిశిత పరిశీలన జరగనుంది. తద్వారా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు లభించనుంది. అదేవిధంగా పార్టీ నిర్వహించే కార్యక్రమాలను, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సంధానకర్తగా ఈ యాప్ ఉపయోగపడనుంది.

Related posts