telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

నాలుగో విడతలో .. ఉద్రిక్తతలు..

issues in fourth schedule polling

మరోసారి ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు, పోలింగ్‌ కేంద్రాల వద్దే తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపా కార్యకర్తలు ఘర్షణకు దిగారు. దీనితో ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేయాల్సి వచ్చింది. మరోవైపు ఆసన్‌సోల్‌ ప్రాంతంలో కేంద్రమంత్రి బాబుల్‌ సుప్రియో కారుపై కొందరు దాడి చేశారు. సార్వ్రత్రిక ఎన్నికల నాలుగో విడత పోలింగ్‌ సోమవారం కొనసాగుతోంది. ఈ దశలో పశ్చిమబెంగాల్‌లోని 8 లోక్‌సభ నియోజకవర్గాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఆసన్‌సోల్‌ నియోజకవర్గంలోని ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద తృణమూల్‌ కార్యకర్తలు భద్రతాసిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కేంద్రబలగాలు లేకుండానే పోలింగ్‌ నిర్వహించడాన్ని తృణమూల్‌ కార్యకర్తలు తప్పుబట్టారు. అనంతరం భాజపా కార్యకర్తలు కూడా ఘర్షణకు దిగారు.

ఆందోళనకారులను అరెస్టు చేసేందుకు పోలీసులు వారిపై లాఠీఛార్జ్‌ జరిపారు. ఇదే పోలింగ్‌ కేంద్రం వద్ద భాజపా అభ్యర్థి, కేంద్రమంత్రి బాబుల్‌ సుప్రియో కారుపై దాడి జరిగింది. పోలింగ్‌ కేంద్రం వద్దకు వచ్చిన బాబుల్‌ సుప్రియోను కొందరు ఆందోళనకారులు అడ్డుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఆయన కారు అద్దాలు పగలగొట్టారు. ‘పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటర్లను అడ్డుకుంటున్నారని సమాచారం రావడంతో నేను ఇక్కడకు వచ్చాను. అప్పుడే కొందరు నా కారుపై దాడి చేశారు’ అని సుప్రియో తెలిపారు.

Related posts