ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడినప్పుడు ప్రపంచ దేశాల నేతలు ఎంతో శ్రద్ధగా వింటున్నారని, దీనికి కారణం అంతర్జాతీయ వేదికపై భారత్ బలం, సత్తా ప్రదర్శితం కావడమేనని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.
భారత్కు దక్కాల్సిన సరైన స్థానం ఇప్పుడు లభిస్తోందని, అందుకే ప్రపంచం మన దేశాన్ని గమనిస్తోందని ఆయన పేర్కొన్నారు.
పూణెలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భగవత్ ప్రసంగించారు.
భారత్ అభివృద్ధి పథంలో పయనిస్తే ప్రపంచ సమస్యలు పరిష్కారమవుతాయని, ఘర్షణలు తగ్గి శాంతి నెలకొంటుందని విశ్వాసం ఉందని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు కూడా భారత్ నుంచి ఇదే ఆశిస్తున్నాయని ఆయన తెలిపారు.
సంఘ్ స్థాపించి వందేళ్లు పూర్తయినప్పటికీ, సమాజాన్ని ఏకం చేసే పనిలో ఇంత జాప్యం ఎందుకు జరిగిందనే దానిపై ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని భగవత్ అన్నారు.
ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్, తొలితరం కార్యకర్తల త్యాగాల వల్లే సంఘ్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకుందని అన్నారు.
తాము ఆలస్యంగా రాలేదని, తమ మాట వినడం మీరే ఆలస్యం చేశారని ఒక సందర్భంలో తాను చెప్పినట్లు భగవత్ గుర్తు చేసుకున్నారు.
“వైవిధ్యంలో ఏకత్వమే మన పునాది. ధర్మం ఆధారంగా మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగాలి” అని ఆయన పిలుపునిచ్చారు.


జానారెడ్డి పెద్ద కొడుకుగా ఉంటా : రేవంత్ రెడ్డి