తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై రాష్ట్ర బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది.
రాజకీయపరమైన అంశాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
గత ఎన్నికల ప్రచార సమయంలో కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలు తమ పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ తెలంగాణ బీజేపీ ఆయనపై పరువు నష్టం దావా వేసింది.
తొలుత ఈ కేసును తెలంగాణ హైకోర్టులో దాఖలు చేయగా, విచారణ అనంతరం న్యాయస్థానం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.
హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ బీజేపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం, రాజకీయ నాయకులు చేసే ఆరోపణలు, విమర్శలకు సంబంధించిన వివాదాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
ఈ క్రమంలో బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ కేసులో సీఎం రేవంత్ రెడ్డికి పూర్తిస్థాయిలో ఉపశమనం లభించినట్లయింది.