భానుడి ప్రతాపానికి ఆంధ్రప్రదేశ్ అగ్నిగుండగా మారింది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మండుటెండల్లో బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. విశాఖలో భానుడు భగభగ మండిపోతున్నాడు. సాగర తీరం నిప్పులకొలిమిలా తలపిస్తోంది. వేడిగాలులు, ఉక్కపోతతో నగర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరులో అత్యధికంగా 45.18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేవరపల్లిలో 45.10 డిగ్రీలు, ఉంగటూరులో 45.04 డిగ్రీల సెంటీగ్రేడు ఉష్ణోగ్రత నమోదైంది.
విజయగనరం జిల్లా బొండపల్లి, కన్నెమెరకలో 45.14 డిగ్రీలు, ప్రకాశం జిల్లా టంగుటూరులో 45.11 డిగ్రీలు, శృంగవరపుకోటలో 45.06 డిగ్రీలు నమోదైంది. ఈ నెల 18వ తేదీ వరకు ఎండల తీవ్రత ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తేమ శాతం అనూహ్యంగా పెరుగుతుండటంతో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

