telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విద్యుత్ శాఖ పై జగన్ మోహన్ రెడ్డి చేసేవన్నీ తప్పుడు ప్రచారా లు: గొట్టిపాటి రవి

విద్యుత్ శాఖ పై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసేవన్నీ తప్పుడు ప్రచారాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు.

తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి గురువారం మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు.

యాక్సిస్, బ్రూక్ ఫీల్డ్ కంపెనీతో కూటమి ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాల పై అవినీతి సొమ్ముతో ఏర్పాటు చేసిన సాక్షి మీడియాను అడ్డం పెట్టుకుని జగన్ మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ ప్రభుత్వం లో సెకీ నుంచి రూ.2.49కి విద్యుత్ కొనుగోలు చేసామనేది పచ్చి అబద్ధమని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. ట్రాన్స్మిషన్ లాసెస్, ఇతర ఖర్చులన్నీ కలిపితే రూ. 5 పైనే ఖర్చు చేయాల్సి వస్తుందని మంత్రి వివరించారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై జగన్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. అత్యధిక విద్యుత్ వినియోగం జరిగే సమయంలో ఒత్తిడిని తట్టుకునేందుకు, ప్రజలకు నిరంతరాయ విద్యుత్ అందించేందుకు యాక్సిస్ బ్రూక్ ఫీల్డ్ ఒప్పందాలు ఎంతో ఉపయోగపడతాయని మంత్రి స్పష్టం చేశారు.

ఈ ఒప్పందాలతో రాయలసీమ ప్రాంతంలో 400 మోగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో పాటు రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఈ ఒప్పందం ద్వారా పీక్ అవర్స్ లో కూడా యూనిట్ రూ.4.60కే విద్యుత్ దొరుకుతుందని స్పష్టం చేశారు.

జగన్ రెడ్డి హయాంలో 2022 లో రూ.5.12కు నాటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే మా ప్రభుత్వం యూనిట్ విద్యుత్ ను రూ.4.60కి తగ్గించి ఒప్పందం చేసుకున్నామని వివరించారు. 1,700 ఎకరాలను రైతుల నుంచి తీసుకుని వారికి ఏడాదికి రూ.31,000 కౌలు అందిస్తున్నామని అన్నారు.

అంతేగాక రాష్ట్రానికి యాక్సిస్ ఎనర్జీ నుంచి 9 శాతం జీఎస్టీ రూపంలో ఆదాయం లభిస్తుందన్నారు. యాక్సిస్ ఎనర్జీ తన పెట్టుబడులను ఏపీలో పెట్టిందని దీని ద్వారా విద్యుత్ కొనుగోళ్లు చేస్తుండటం వల్ల ట్రాన్స్మిషన్ లాస్ లు లాంటివి ఉండవని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు.

ఇటువంటి ఒప్పందాల ద్వారా విద్యుత్ ఛార్జీలు తగ్గించి ప్రజలపై భారం లేకుండా చేయాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన అని మంత్రి స్పష్టం చేశారు.

పెట్టుబడిదారుల్ని తరిమికొట్టిన చరిత్ర జగన్ ది అయితే, పెట్టుబడులు ఆహ్వానించి రాష్ట్రానికి ఆదాయం సమకూరుస్తూ ఉపాధి కల్పిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదని మంత్రి గొట్టిపాటి కొనియాడారు.

రాష్ట్రం విడిపోయిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ గా మార్చారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు.

మిగులు విద్యుత్ రాష్ట్రంగా వైసీపీకి అప్పగిస్తే 2019 – 2024 వరకు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

షార్ట్ టైం పవర్ పర్చేజ్ పేరుతో ఒక్క సంవత్సరంలోనే రూ.10,000 కోట్లు ఖర్చు చేసి ప్రజల నెత్తిన మోయలేని భారాన్ని మోపారని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఎఫ్.పీ.పీ.ఐ ఛార్జీల పేరిట వేసిన రూ.20,000 కోట్ల విద్యుత్ భారం ప్రస్తుతం ప్రజలపై పడిందన్నారు.

దీనిని కూడా కూటమి ప్రభుత్వం వేసిందని అసత్య ప్రచారం చేస్తూ బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. వీటన్నింటిపైనా అసెంబ్లీ సాక్షిగా కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పిందని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీ పెంచలేదని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు.

ఇకపై పెంచకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. 2022 నవంబర్ లో కేవలం సోలార్ విద్యుత్ ను రూ.5.12 కి యూనిట్ కొనుగోలు చేసేలా వైసీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు.

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇదే ఒప్పందం ద్వారా సోలార్, విండ్, బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ ను యూనిట్ కు రూ. 4.60 కు పీక్ అవర్స్ లో సరఫరా చేసేలా కొనుగోలు ఒప్పందం చేసుకున్నామన్నారు.

పీక్ అవర్స్ లో (అత్యధిక వినియోగ సమయం) కూటమి ప్రభుత్వం రూ.4.60కు కొనుగోలు చేస్తున్న యూనిట్ ను వైసీపీ ప్రభుత్వం రూ.9.30కు కొనుగోలు చేసిందని మంత్రి వెల్లడించారు.

ఇటువంటి నిర్ణయాలతో ప్రజల నెత్తిన ఐదేళ్లలోనే సుమారు రూ.1.29 లక్షల కోట్ల భారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో రాజస్థాన్ సెకీతో చేసుకున్న ఒప్పందంతో డిస్కంలు, ట్రాన్స్ కో, జెన్ కోలు సర్వనాశనం అయ్యాయని తెలిపారు.

అవినీతి సొమ్ముతో ఏర్పడ్డ సాక్షి మీడియాను అడ్డం పెట్టుకుని జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై నిందలు వేస్తూ… విష ప్రచారం చేస్తున్నారని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.

జగన్ అవినీతి చర్యలు, అనాలోచిన నిర్ణయాలతో తీవ్రంగా నష్ట పోయిన విద్యుత్ రంగాన్ని మరలా గాడిన పెట్టేందుకు కూటమి ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ చేపడుతుందని వివరించారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే రాళ్లు వేసే కార్యక్రమాన్ని చేపట్టారని మండి పడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసే మంచి పనులపై జగన్ అండ్ కో చేసే అసత్య ప్రచారాలపై ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.

గత ప్రభుత్వంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు అనేక చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఏదేమైనా అత్యధిక వినియోగ సమయంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు, రాష్ట్రంలో రైతులు, యువతకు లబ్ధి కలిగించేందుకు విద్యుత్ ఒప్పందాలను చేసుకుంటున్నట్లు మంత్రి గొట్టిపాటి వివరించారు.

Related posts