తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 565 మండలాల్లో మొత్తం ఐదు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి.
ఇందుకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియకు అక్టోబర్ 9 వరకు కొనసాగుతుంది. నామినేషన్ల ప్రక్రియ నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచే ప్రారంభమవుతుంది.
మెుత్తం ఐదు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీడీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రక్రియ నవంబర్ 11తో ముగుస్తుంది.
ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ఆంక్షలు ఉంటాయి.
ఎన్నికల సందర్భంగా అక్రమ నగదు రవాణా అరికట్టేందుకు అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తారు.
నేటి నుంచి ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఒక సామాన్య వ్యక్తి రూ. 50 వేల వరకు మాత్రమే నగదు తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది.
ఎన్నికల కమిషన్ సూచించిన దానికంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా, సరైన పత్రాలు లేకపోతే ఆ నగదును అధికారులు సీజ్ చేస్తారు.
ఎక్కువ మొత్తంలో నగదు దొరికితే ఎన్నికల అధికారులు ఐటీ (IT), జీఎస్టీ అధికారులకు సమాచారం అందించి ఆ డబ్బును కోర్టులో జమ చేస్తారు.
ప్రజాప్రతినిధులు, సాధారణ ప్రజలు ఎన్నికల నిబంధనలను పాటించాలని, అనవసర ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నగదుకు సంబంధించిన తగిన ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.