telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 లో రైనా ఆడబోయే జట్టు..?

చెన్నై సూపర్ కింగ్స్‌ అభిమానులకి శుభవార్త. వ్యక్తిగత కారణాలతో యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 నుంచి తప్పుకున్న మిస్టర్ ఐపీఎల్, టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా.. వచ్చే ఏడాది మళ్లీ చెన్నై జట్టు తరఫున ఆడబోతున్నాడు. ఈ విషయాన్ని తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ అధికారి ఒకరు తెలిపారు. దీంతో రైనాను మళ్లీ యెల్లో జెర్సీలోనే అభిమానులు చూడనున్నారు. రైనా లేనిలోటు ఐపీఎల్ 2020లో స్పష్టంగా కనిపించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2020 సీజన్‌ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్ జట్టు సభ్యులతో పాటు దుబాయ్ వెళ్లిన సురేష్ రైనా.. వారం రోజులు తిరగకముందే స్వదేశానికి వచ్చేశాడు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో రైనా మేనత్త కుటుంబ సభ్యులు దారుణ హత్యకు గురైన విషయం తెలుసుకుని స్వదేశానికి తిరిగొచ్చాడు. ఆపై రైనా మళ్లీ ఐపీఎల్ 2020 కోసం యూఏఈ వెళుతాడు అనే వార్తలు వచ్చాయి. అయితే రైనా పేరును చెన్నై యాజమాన్యం తమ వెబ్‌సైట్ నుంచి తొలగించింది. దీంతో రైనా ఇక చెన్నైకి ఆడడనే వార్తలు వచ్చాయి.

ఇక చెన్నై జట్టులో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో సురేష్ రైనా స్వదేశానికి వచ్చేశాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. అలానే తనకి రూమ్‌ని కేటాయించే విషయంలోనూ చెన్నై మేనేజ్‌మెంట్‌తో అతను గొడవపడినట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే చెన్నై టీం బాస్ శ్రీనివాసన్, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఈ వార్తలపై స్పందించి అవన్ని వట్టి పుకార్లే అని చెప్పారు. రైనాతో ఎలాంటి గొడవ జరగలేదని, అతనిపై కోపం లేదని చెప్పుకొచ్చారు. అక్కడితో ఆ విషయం క్లోజ్ అయింది. తాజాగా ముంబై మిర్రర్‌తో చెన్నై సూపర్ కింగ్స్ అధికారి ఒకరు మాట్లాడుతూ… ‘సురేశ్ రైనా చెన్నై జట్టు‌తోనే ఉంటాడు. అతడ్ని వదులుకునే ఆలోచన ఫ్రాంఛైజీకి లేదు’ అని తెలిపారు. మొత్తానికి రైనాపై చెన్నై ఫ్రాంఛైజీ నమ్మకం ఉంచింది. గత సీజన్‌లో సురేష్ రైనా గైర్హాజరీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలోని చెన్నై జట్టు 14 మ్యాచుల్లో 6 విజయాలు, 8 ఓటములతో 7వ స్థానంలో నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో చెన్నై టీమ్ ప్లేఆఫ్‌కి చేరుకుండా ఇలా నిష్క్రమించడం కూడా ఇదే తొలిసారి. రైనా లేకపోవడం.. మహీ సారథిగానే కాకుండా బ్యాట్స్‌మన్‌గా కూడా విఫలమవడం.. షేన్ వాట్సన్, అంబటి రాయుడు పరుగులు చేయకపోవడం.. బౌలర్లు వికెట్లు తీయకపోవడంతో చెన్నై ప్లేఆఫ్‌కి చేరకుండానే ఇంటిదారిపట్టింది.

ఐపీఎల్‌లో 193 మ్యాచ్‌లాడిన సురేశ్ రైనా 137 స్ట్రైక్‌రేట్‌తో ఏకంగా 5,368 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చెన్నై టీమ్‌లో ఈ రికార్డ్‌లు ఏ బ్యాట్స్‌మెన్‌కి లేవు. 2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. తొలి సీజన్ నుంచి చెన్నై తరఫునే రైనా టోర్నీలో ఆడుతున్నాడు. మధ్యలో 2016, 2017లో నిషేధం కారణంగా టోర్నీకి చెన్నై దూరమవగా.. ఆ రెండేళ్లు గుజరాత్ లయన్స్‌కి ఆడాడు. మళ్లీ చెన్నై రీఎంట్రీ తర్వాత టీమ్‌లోకి వచ్చేశాడు. ఆగస్టు 15న సురేష్ రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. దశాబ్దకాలం అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగిన రైనా.. 18 టెస్ట్‌లు, 226 వన్డేలు, 78 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక మూడు ఫార్మాట్‌లలోనూ సెంచరీలు సాధించిన తొలి భారతీయ క్రికెటర్‌గా రైనా పేరుపై రికార్డు ఉంది. చురుకైన ఫీల్డర్‌గా గుర్తింపు పొందిన రైనా.. తన కెరీర్‌ మొత్తంలో 167 క్యాచ్‌లు అందుకున్నాడు.

Related posts