మూడేళ్ల తర్వాత “ఇస్మార్ట్ శంకర్”తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు డైరెక్టర్ పూరి జగన్నాథ్. తాజాగా పూరి ఓ ఇంటర్వ్యూలో తన చిన్ననాటి అలవాట్ల గురించి, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చిన్నప్పుడే కథలు రాసే అలవాటుందని చెప్పిన పూరి 10 సంవత్సరాల వయసులోనే తాను సిగరెట్స్ కాల్చేవాడనని చెప్పుకున్నారు. స్నేహితులకు తెలియకుండా ఓ సిగరెట్ ప్యాకెట్ తన దగ్గర ఉంచుకునేవారట. అసలు ఆ వయసులో సిగరెట్ ఎందుకు తాగే అలవాటు వచ్చిందని ప్రశ్నిస్తే “ఏం చేస్తామండి.. ఎదవ పుట్టుక పుట్టాక అలవాటైంది. నేను స్కూల్ నుండి రాగానే తాతమ్మతో కలిసి బీడి, చుట్ట కాల్చేవాడిని. అలా సిగరెట్ తాగే అలవాటు వచ్చేసింది` అని చెప్పారు పూరి. ఇంట్లో తమ్ముళ్లు, కొడుక్కి లేని సిగరెట్ అలవాటు తనకు ఉందని ఈ సందర్భంగా తనకున్న చెడు అలవాటు గురించి పూరి చెప్పుకొచ్చారు. ఇంకా తన పెళ్లి గురించి కూడా పూరీ జగన్నాథ్ ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు. “నిన్నే పెళ్లాడతా” సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న రోజుల్లోనే ప్రేమలో పడ్డాను. సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఆ సమయంలో అర్జెంటుగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. ఎర్రగడ్డలోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నాను. యాంకర్ ఝాన్సీ తాళిబొట్టు కొనిచ్చింది. నటి హేమ పెళ్లి బట్టలు కొంది. మరొకరు కూల్‌డ్రింక్స్ కొని తెచ్చారు. తాళి కట్టేసి.. ఆ కూల్ డ్రింక్స్ అందరికీ పంచేసి పదకొండు గంటలకల్లా మళ్లీ షూటింగ్‌కు వెళ్లిపోయాను” అని పూరీ గుర్తు చేసుకున్నారు.
previous post
బికినీలో అనుష్క శర్మ… కోహ్లీ రియాక్షన్…!