telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జీహెచ్‌ఎంసీ విస్తరణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) విస్తరణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జీహెచ్‌ఎంసీకి ఔటర్‌ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్‌)ను సరిహద్దుగా నిర్ణయించింది.

హైదరాబాద్‌ మహానగరం దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో హైదరాబాద్‌ శివారులో ఉన్న 20 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అందుకోసం జీహెచ్‌ఎంసీ, తెలంగాణ మునిసిపాలిటీ చట్టాలను సవరించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని సమావేశం అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు మీడియా సమావేశంలో తెలిపారు.

విలీన ప్రక్రియలో అన్ని వర్గాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. విలీనం కానున్నమునిసిపాలిటీల్లో కొన్నింటి పరిధి ఓఆర్‌ఆర్‌ అవతల కూడా విస్తరించి ఉంది.

ప్రస్తుతం 150 మునిసిపల్‌ డివిజన్లతో ఉన్న జీహెచ్‌ఎంసీ పరిధి కొత్తవాటి విలీనంతో మూడింతలు పెరగనుంది. నగర పరిధి దాదాపు 2,735 చదరపు కిలోమీటర్లు ఉండనుంది. జనాభా దాదాపు రెండు కోట్లు ఉంటుంది.

తాజాగా విలీన కానున్న 27 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లపాలక మండళ్ల గడువు ముగిసి చాలా కాలమైంది.

అక్కడ ఎన్నికలు నిర్వహించకపోవటంతో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పాలకమండలి గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగుస్తుంది.

జీహెచ్‌ఎంసీలో 27 మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల విలీన ప్రతిపాదనపై అధ్యయనం చేసి నివేదికతో కూడిన అభిప్రాయం చెప్పేందుకు బల్దియా కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది.

మంత్రివర్గం నిర్ణయం నేపథ్యంలో విలీన ప్రతిపాదనను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌మంగళవారం కౌన్సిల్‌ ముందు ఉంచారు.

జీహెచ్‌ఎంసీ చట్టం 1955 ప్రకారం విలీన ప్రతిపాదనపై అవసరమైన అధ్యయనం చేసి అభిప్రాయం తెలపాలని ఈ నెల 21న సర్కారు బల్దియాకు మెమో పంపింది.

దీంతో టేబుల్‌ ఎజెండాగా ఈ అంశాన్ని కౌన్సిల్‌లో ప్రస్తావించగా మెజార్టీ సభ్యులు ఆమోదించారు.

విలీన ప్రతిపాదనపై ఎంఐఎం అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే, సర్కారు నిర్ణయంపై అభ్యంతరం తెలపడం సబబు కాదంటూ  అభిప్రాయం చెప్పాలన్న ప్రతిపాదనను ఆమోదిస్తున్నట్టు మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి ప్రకటించారు.

జీహెచ్‌ఎంసీ పాలక మండలి గడువు ముగిసిన తర్వాతే విలీనం జరుగుతుందని ఓ అధికారి తెలిపారు.

విలీనం అనంతరం మొత్తం ప్రాంతాన్ని విభజించే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే.. డివిజన్ల పునర్విభజన, కార్పొరేషన్ల విభజన ఒకటి రెండు నెలల్లో పూర్తవుతుందని చెప్పారు.

Related posts