telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

రేషన్ కార్డులకు కొత్త రూపం: అధునాతన స్మార్ట్ కార్డులుగా మార్పు

రాష్ట్రంలో రేషన్‌ కార్డుల రూపుమారుతోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారవుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం కార్డులకు పార్టీ రంగులు పులిమేసి.. వాటిపై ఒకవైపు జగన్‌ బొమ్మ, మరోవైపు వైఎస్‌ రాజశేఖరరెడ్డి బొమ్మను ముద్రించి పంపిణీ చేసింది.

ఇప్పుడు వాటికి స్వస్తి చెప్పి.. రాజకీయ పార్టీల రంగులు లేకుండా, నేతల బొమ్మలు ముద్రించకుండా కొత్త కార్డులను రూపొందిస్తున్నారు.

పాత వాటి స్థానంలో ఈ కొత్త కార్డులు జారీ చేయడంతో పాటు ఇకపై కొత్తగా మంజూరు చేసే కార్డులన్నీ కూడా స్మార్ట్‌ కార్డులుగానే ఉండనున్నాయి.

బ్యాంకు ఏటీఎం కార్డు తరహాలో క్యూఆర్‌ కోడ్‌తో ఈ స్మార్ట్‌ రేషన్‌ కార్డును రూపొందిస్తున్నారు. ఈ కార్డుల జారీకి పౌరసరఫరాల శాఖ ఇప్పటికే కసరత్తును పూర్తి చేసింది.

స్మార్ట్‌ రేషన్‌ కార్డుపై ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం, మరోవైపు కార్డుదారు (కుటుంబ పెద్ద) ఫోటో ఉంటాయి. ఆ రేషన్‌ కార్డు నంబరు, రేషన్‌షాపు నంబరు తదితర వివరాలుంటాయి.

కార్డు వెనుకవైపు లబ్ధిదారు కుటుంబ సభ్యుల వివరాలుంటాయి.

ఈ స్మార్ట్‌ రేషన్‌ కార్డును రేషన్‌ డీలర్ల వద్ద ఉండే ఈ-పోస్‌ యంత్రాల సహాయంతో స్కాన్‌ చేస్తే ఆ కుటుంబానికి సంబంధించిన వివరాలతోపాటు రేషన్‌ సరుకుల వినియోగానికి సంబంధించిన పూర్తి సమాచారం ప్రత్యక్షమవుతుంది.

అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించే ఈ కొత్త స్మార్ట్‌ రేషన్‌ కార్డుల ముద్రణ కోసం ఏపీటీఎస్‌ ద్వారా టెండరు ప్రక్రియ పూర్తి చేశారు.

ప్రస్తుతం ముద్రణ దశలో ఉన్న కొత్త స్మార్ట్‌ రేషన్‌ కార్డులను వచ్చే నెలలో పంపిణీ చేసేందుకు పౌరసరఫరాలశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

2 లక్షల కుటుంబాలకు కొత్తగా లబ్ధి

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 1.46 కోట్లకుపైగా కుటుంబాలకు రేషన్‌ కార్డులు ఉన్నాయి. వైసీపీ హయాంలో అర్హతలున్న నవదంపతులు, పేదలు రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నా అప్పటి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో లక్షల సంఖ్యలో దరఖాస్తులు మూలనపడి ఉన్నాయి.

అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో అర్హులైనవారందరికీ కొత్త రేషన్‌ కార్డులను మంజూరు చేసింది.

దీంతోపాటు తల్లిదండ్రుల నుంచి వేరుపడిన వారికి స్ల్పిట్‌ కార్డులు, ఉన్న రేషన్‌ కార్డులలో సభ్యుల చేర్పులు, తొలగింపులు, చిరునామాల మార్పులకు అవకాశం కల్పిస్తూ గత మే నెలలో దరఖాస్తులను స్వీకరించిన సంగతి తెలిసిందే.

దీంతో ప్రతి జిల్లా నుంచి లక్షలాదిగా వచ్చిపడిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్‌ కార్డుల కోసం 1,47,187 మంది దరఖాస్తులు చేసుకోగా.. వారిలో 89,864 మందికి కొత్త కార్డులు మంజూరు చేశారు.

38,046 మంది దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించారు. కుటుంబ విభజన (స్ప్లిట్‌) కార్డుల కోసం 1,43,745 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 1,09,787 మందికి కొత్త కార్డులు మంజూరు చేశారు.

20,403 దరఖాస్తులను తిరస్కరించారు. ఇలా కొత్తగా మంజూరు చేసిన దాదాపు 2 లక్షల కొత్త రేషన్‌ కార్డులలోని లబ్ధిదారులకు సెప్టెంబరు నెల నుంచి రేషన్‌ సరుకులు పంపిణీ చేసే అవకాశం ఉంది.

కొత్తగా వచ్చిన కార్డులతో రాష్ట్రంలో మొత్తం రేషన్‌ కార్డుల సంఖ్య 1.48 కోట్లకు చేరింది.

Related posts