telugu navyamedia
రాజకీయ వార్తలు

ఆ రాష్ట్రంలో మరో కొత్త పార్టీ రానుందా…?

తమిళనాడులో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. త్వరలోనే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి… ఈ తరుణంలో కొత్త కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి.. తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే, డీఎంకేకి ప్రత్యేక స్థానం ఉంది… అయితే, అన్నాడీఎంకే అధికారంలో ఉన్నా.. మాజీ సీఎం జయలలిత కన్నుమూసిన తర్వాత పరిస్థితి మారిపోయింది అని చెబుతున్నారు. ఇక, జయ మృతి తర్వాత తమిళనాడులో ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి.. కమల్ హాసన్ కొత్త పార్టీ పెట్టి.. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటనలు చేస్తుండగా… తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా పార్టీ పెట్టడం ఫైనల్ అయిపోయింది.. ఇక, ఇప్పుడు ద్రావిడ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పురుడుపోసుకునేలా కనిపిస్తోంది… ఈ సారి.. తమిళనాడు రాజకీయాల్లో కీలక భూమిక పోషించిన మాజీ సీఎం కరుణానిధి కుమారుడు అళగిరి కూడా కొత్త పార్టీ పెట్టే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి.  అనారోగ్యం బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లి దయాళు అమ్మాళ్‌ను గోపాలపురంలో పరమార్శించిన అళగిరి.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.. ‘జనవరి 3వ తేదీన నా అనుచరులు, కార్యకర్తలతో సమావేశం కాబోతున్నారు.. కొత్త పార్టీ స్థాపించడంపై ఈ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. ఒకవేళ నా కార్యకర్తలు కొత్త పార్టీ పెట్టాలని సూచిస్తే… కొత్త పార్టీ పెడతానన్నఆయన.. డీఎంకేకు మాత్రం మద్దతివ్వబోనని స్పష్టం చేశారు. ఇక, డీఎంకేలోకి తిరిగి రమ్మని ఆహ్వానం అందిందా? అని ప్రశ్నించగా.. ఇప్పటి వరకూ అలాంటి ఆహ్వానం రాలేదన్న ఆయన.. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న రజనీకాంత్‌ తిరిగి చెన్నై వచ్చిన తర్వాత ఆయనను కలవనున్నట్టు చెప్పుకొచ్చారు. దీంతో.. తమిళనాడు రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి.. అళగిరి కొత్త పార్టీ పెట్టి రజనీకాంత్‌కు మద్దతు తెలుపుతారా? కొత్త పార్టీతోనే జనంలోకి వెళ్తారా? అనే చర్చ హాట్‌టాపిక్‌గా మారింది.

Related posts