సునీత బోయ జూనియర్ ఆర్టిస్టుగా టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. అయితే సినీ విమర్శకుడు కత్తి మహేష్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని గతంలో ఆమె ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో కత్తి మహేష్‌పై లైంగిక ఆరోపణలతో వార్తల్లో నిలిచి హాట్ టాపిక్ అయిన సునీత.. ఇప్పుడు ఫిల్మ్ చాంబర్ వద్ద నిరసనకు దిగడంతో మరోసారి హాట్ టాపిక్ అయింది. ఫిల్మ్ చాంబర్లో మరో యువతి నిరసనకు దిగింది. సునీత బోయ అనే జూనియర్ ఆర్టిస్టు తనకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టింది. గీతా ఆర్ట్స్‌లో సినిమా ఛాన్సులు ఇప్పిస్తానని చెప్పి నిర్మాత బన్నీ వాసు మోసం చేశారంటూ సునీత ఆరోపించారు. పవన్ స్వయంగా వచ్చి సమాధానం చెబితేనే తాను బయటకు వస్తానంది. తన సేవలను వాడుకుని, ఆపై అన్యాయం చేశారని సునీత పవన్ పై ఆరోపణలు చేసింది. జనసేన పార్టీ కోసం తాను అహర్నిశలూ శ్రమించానని, తనను ఆదుకుంటానని చెప్పి వాడుకుని, ఇప్పుడు తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించింది. తనను తాను గొలుసులతో బంధించుకుని ఫిల్మ్ చాంబర్లో మంగళవారం రాత్రంతా నిరసన తెలిపింది. విషయం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు. ఉదయం 6 గంటల సమయంలో ఫిల్మ్ చాంబర్ కార్యాలయానికి వచ్చి, బలవంతంగా తలుపులు తెరిచారు. సునీతను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. ఆమె ఆరోపణల్లో ఎంత వరకు నిజం ఉందో తెలుసుకునేందుకు పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఇదంతా పబ్లిసిటీ కోసమే అంటున్నారు మెగా అభిమానులు.