మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం “సైరా నరసింహారెడ్డి”. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు వంటి టాప్ స్టార్స్ నటిస్తున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా చిత్రం విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. అయితే ఈ చిత్రంలో అనుష్క కూడా కీలకపాత్రలో నటిస్తుందనే వార్తలు చాలా రోజులుగా విన్పిస్తున్నాయి. ఈ విషయంపై చిత్రబృందం ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ సోషల్ మీడియాలో వార్తలు ప్రచారమవుతూనే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం అనుష్క సైరా మూవీ చిత్రీకరణలో గాయపడిందట. కీలకమైన సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో అనుష్క కాలికి గాయమైనట్టు సమాచారం. చికిత్స చేసిన వైద్యులు అనుష్కని కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోమని సూచించారట. ఈ ఘటన జరిగి చాలా రోజులే అవుతున్నప్పటికి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని అంటున్నారు. అనుష్క 13 ఏళ్ళ తర్వాత చిరుతో నటిస్తుంది. మరోవైపు అనుష్క “నిశ్శబ్ధం” అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల అమెరికాలో మూవీ చిత్రీకరణ ప్రారంభమైంది. మాధవన్ మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.