telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

మేడారం వనదేవతల దర్శనార్థం బారీసంఖ్యలో భక్తులు

ములుగు జిల్లాలోని మేడారం మహా జాతర సమీపిస్తున్న వేళ, వనదేవతలు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల దర్శనార్థం విచ్చేసే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

ఆదివారం సెలవు దినం కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలిరావడంతో మేడారం ప్రాంతం మినీ జాతరను తలపించింది.

కుటుంబ సభ్యులతో తరలివచ్చిన భక్తులు తొలుత జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి, అక్కడే జంపన్న, నాగులమ్మలకు ముడుపులు చెల్లించారు.

అనంతరం గద్దెల ప్రాంగణానికి చేరుకుని వనదేవతలను దర్శించుకుని బంగారం (బెల్లం), పసుపు, కుంకుమ, సారె సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు.

జంపన్నవాగు పరిసరాలు, గద్దెల ప్రాంతం ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులతో కిటకిటలాడాయి. మేడారంకు వెళ్లే ప్రధాన రహదారులన్నీ వాహనాలతో నిండిపోయి ట్రాఫిక్‌ రద్దీ నెలకొంది.

ఇదే సమయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ఎంపీ బలరాం నాయక్‌ సహా పలువురు అధికారులు దేవతల దర్శనంతో పాటు ఏర్పాట్ల పర్యవేక్షణకు రావడంతో వారి కాన్వాయ్‌ల కారణంగా కొన్నిచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

Related posts