ప్రజా రాజధాని అమరావతిలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. అమరావతిలో వాజ్‌పేయి శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వాజ్‌పేయి విగ్రహావిష్కరణ అనంతరం చంద్రబాబునాయుడు ప్రసంగించారు.
జై భారత్, జై తెలుగుతల్లి అంటూ ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అమరావతిలో వాజ్‌పేయి జయంతి ఉత్సవాలను నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.
ప్రపంచమంతా గుర్తించేలా అమరావతిని తీర్చిదిద్దుతామని ఆయన పునరుద్ఘాటించారు.
వాజ్‌పేయి స్మృతివనాన్ని అమరావతిలో నిర్మించడానికి ఇక్కడి రైతుల త్యాగమే స్ఫూర్తి అని కొనియాడారు.
చరిత్ర గుర్తించే విధంగా వాజ్‌పేయికి ఘనమైన నివాళి ఇవ్వాలనే సదుద్దేశంతో స్మృతి వనం నిర్మిస్తున్నట్లు చెప్పారు.
26 జిల్లా కేంద్రాల్లో అటల్ విగ్రహాలను ప్రతిష్ఠించేలా కూటమి సంయుక్తంగా కృషి చేస్తోందని చంద్రబాబునాయుడు తెలిపారు.
అటల్ జన్మదినాన్ని సుపరిపాలన దివస్‌గా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామని ఆయన గుర్తు చేశారు.
తెలుగు నేలలో కూడా అలాంటి స్ఫూర్తినిచ్చిన నేత ఎన్టీఆర్ అని, వీరంతా చరిత్రను తిరగరాసిన గొప్ప నాయకులని ఆయన అభివర్ణించారు.
నేషనల్ ఫ్రంట్ ద్వారా కాంగ్రెసేతర పార్టీలను ఏకం చేసిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని ఆయన అన్నారు.
దేశాన్ని అణుశక్తిగా మార్చి ప్రపంచానికి భారతీయుల సత్తా చాటిన ధీశాలి వాజ్‌పేయి అని చంద్రబాబు అన్నారు.
కార్గిల్ యుద్ధం ద్వారా వాజ్‌పేయి, సింధూర్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ వైపు ఎవరైనా చూస్తే తగిన బుద్ధి చెబుతామని గట్టిగా చెప్పారని గుర్తు చేశారు.
అబ్దుల్ కలాం, వాజ్‌పేయి ఇద్దరూ దేశం కోసం నిరంతరం శ్రమించిన మహానుభావులని అన్నారు. దేశం మెచ్చిన నేతగా వాజ్‌పేయి చిరస్మరణీయులని, అందుకే ఆయన స్మారకాన్ని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఎన్టీఆర్ వంటి మహనీయులకు కూడా అమరావతిలో స్మారక స్థూపం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
వాజ్‌పేయి వంటి ఉన్నత స్థాయి నాయకులతో రాజకీయం చేసిన తనకు ఇప్పుడు చిల్లర వ్యక్తులతో రాజకీయం చేయాలంటే సిగ్గుగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు.
గతంలో వాజ్‌పేయి, ఇప్పుడు నరేంద్ర మోదీ తనకు స్ఫూర్తినిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
గత వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ వెంటిలెటర్‌పై ఉందని, ఇప్పుడు కోలుకుని అభివృద్ధి ప్రయాణం మొదలు పెట్టిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.


అందరూ ఎన్టీఆర్ కావాలంటున్నారు …