ఏపీ అభివృద్ధికి ప్రపంచస్థాయి సాంకేతికత, నైపుణ్యాలను జోడించే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు.
ఈ పర్యటనలో భాగంగా ఆయన మెల్బోర్న్లోని ప్రఖ్యాత మెల్బోర్న్ యూనివర్సిటీని సందర్శించారు. వర్సిటీ ఉన్నతస్థాయి బృందంతో సమావేశమై రాష్ట్రానికి పలు రంగాల్లో సహకారం అందించాలని కోరారు.
ముఖ్యంగా క్వాంటమ్ టెక్నాలజీ పరిశోధనలు, ఉపాధ్యాయులకు శిక్షణ వంటి అంశాలపై ఆయన చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ కృత్రిమ మేధ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలతో కలిసి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
వ్యవసాయ రంగంలో పంట దిగుబడులను పెంచడం, నీటి యాజమాన్యం, స్థిరమైన వ్యవసాయ పద్ధతులపై ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేయాలని సూచించారు.
పునరుత్పాదక ఇంధన వనరులు, ఆరోగ్య రంగాల్లో సంయుక్త పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆహ్వానించారు.
డిజిటల్ హెల్త్, టెలీమెడిసిన్ సేవలను మెరుగుపరచడంతో పాటు స్మార్ట్ సిటీల ప్రణాళిక, వ్యర్థాల నిర్వహణ వంటి పట్టణాభివృద్ధి లక్ష్యాల సాధనకు తోడ్పాటునందించాలని కోరారు.
వీసీ ఎమ్మా జాన్స్టన్ మాట్లాడుతూ, 1853లో ఏర్పాటైన తమ విశ్వవిద్యాలయం ఆస్ట్రేలియాలోనే అగ్రగామిగా ఉందని, క్యూఎస్ ప్రపంచ ర్యాంకింగ్స్-2025లో 13వ స్థానంలో నిలిచిందని వివరించారు.
భారత్లో ఇప్పటికే ఐదుకు పైగా విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేస్తున్నామని, ఏపీతో భాగస్వామ్యానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆమె తెలిపారు.