telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ ‘డిజిటల్ బుక్’ యాప్ ద్వారా విడదల రజనిపై తొలి ఫిర్యాదు నమోదు

వైసీపీ అధినేత జగన్ ఇటీవలే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘డిజిటల్ బుక్’ యాప్.

వైసీపీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఫిర్యాదు చేసేందుకు తీసుకొచ్చిన ఈ వేదికపై, ఏకంగా ఆ పార్టీ మాజీ మంత్రి విడదల రజనిపైనే తొలి ఫిర్యాదు నమోదు కావడం తీవ్ర కలకలం రేపుతోంది.

తనపై దాడి చేయించారంటూ నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఈ ఫిర్యాదు చేశారు.

వివరాల్లోకి వెళితే, 2022లో పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని తన ఇల్లు, పార్టీ కార్యాలయం, కారుపై అప్పటి మంత్రి విడదల రజిని దాడి చేయించారని రావు సుబ్రహ్మణ్యం ఆరోపించారు.

ఈ ఘటనపై చర్యలు తీసుకుని, తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆయన నేరుగా వైసీపీ ‘డిజిటల్ బుక్’ యాప్‌ ద్వారా జగన్‌కు ఫిర్యాదు చేశారు.

అనంతరం, యాప్‌లో ఫిర్యాదు నమోదు కాగానే వచ్చిన కంప్లైంట్ టికెట్‌ను ఆయన మీడియాకు ప్రదర్శించారు.

ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, “మాజీ మంత్రి రజనిపై చర్యలు తీసుకుని, నాకు న్యాయం చేయాలని జగన్‌ గారిని కోరాను.

ఈ ఫిర్యాదుపై సరైన విచారణ జరిపిస్తే, జగన్ చెప్పినట్లుగా ఈ యాప్ ద్వారా కార్యకర్తలకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలుగుతుంది” అని పేర్కొన్నారు.

టీడీపీ నేతలు తమను వేధిస్తున్న వారి పేర్లను ‘రెడ్ బుక్‌’లో రాస్తున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, వైసీపీ కార్యకర్తలకు తాము అండగా ఉంటామని భరోసా ఇస్తూ జగన్ ఈ ‘డిజిటల్ బుక్’ యాప్‌ను ప్రారంభించారు.

ఇది కార్యకర్తలకు శ్రీరామరక్ష అని, అధికారంలోకి వచ్చాక ప్రతీ ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు సొంత పార్టీ మాజీ మంత్రిపైనే ఈ యాప్‌లో ఫిర్యాదు అందడంతో, వైసీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Related posts