సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాజ్‌నాథ్ జాతీయ జెండా ఆవిష్కరించారు.
వల్లభాయ్ పటేల్ సమర్థత వల్లే హైదరాబాద్ సంస్థానం భారత్‌లో కలిసిందన్న రక్షణమంత్రి పటేల్ కలలు కన్న దేశాన్ని నిర్మించేందుకు మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమైన సెప్టెంబర్ 17ను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినంగా నిర్వహించింది.
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహిస్తున్న వేడుకలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తొలుత పరేడ్ మైదానంలోని అమర జవాన్ల స్మృతి స్థల్ వద్ద నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. సర్దార్ వల్లభాయ్ విగ్రహానికి నివాళులు అర్పించారు.
భద్రతా బలగాల గౌరవవందనం స్వీకరించారు.
నిజాం పాలనలో రజాకార్లు అనేక దారుణాలు చేశారన్న రాజ్‌నాథ్‌సింగ్ వారి ఆగడాలు తట్టుకోలేక ప్రజలు తిరగబడ్డారని గుర్తుచేశారు. పటేల్ సమర్థత వల్లే హైదరాబాద్ సంస్థానం భారత్‌లో కలిసిందని తెలిపారు.
ఆపరేషన్ పోలోతో సర్దార్ పటేల్ ఎంతో ముందుచూపుతో వ్యవహరించారన్న రాజ్‌నాథ్, పటేల్ కలలు కన్న దేశాన్ని నిర్మించేందుకు మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
అమిత్ షా చొరవ వల్లే కేంద్రం తెలంగాణ విమోచన వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందన్న కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, ఒక వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు రాష్ట్ర పాలకులు అధికారికంగా వేడుకల్ని నిర్వహించడం లేదని ఆరోపించారు.
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక గల్లీ గల్లీలో జాతీయ జెండా ఎగరవేస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రక్షణ శాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో పాటు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ ఈటల రాజేందర్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
పరేడ్ మైదానంలో విమోచన దినోత్సవం కార్యక్రమం అనంతరం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పికెట్ పార్క్‌లో ఏర్పాటు చేసిన వాజ్‌పేయ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.