telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

పాశమైలారం రసాయన పరిశ్రమ దుర్ఘటనపై సీఎం రేవంత్ స్పందన: బాధిత కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం, సమగ్ర విచారణకు ఆదేశాలు

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని రసాయన పరిశ్రమలో జరిగిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు సమగ్రమైన దర్యాప్తునకు ఆదేశించారు.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం సమగ్రమైన కార్యాచరణను రూపొందిస్తుందని చెప్పారు.

ఈ ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ఒక కోటి రూపాయల చొప్పున పరిహారం అందే విధంగా చూస్తుందని తెలిపారు.

పాశమైలారంలోని దుర్ఘటన జరిగిన రసాయన పరిశ్రమను ముఖ్యమంత్రి గారు మంత్రులతో కలిసి పరిశీలించారు.

పరిశ్రమలోని రియాక్టర్ భారీ విస్పోటనం కారణంగా ఏర్పడిన పరిస్థితులు, శిథిలాలు, పరిశ్రమ సముదాయాన్ని పరిశీలించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

మంత్రులు దామోదర రాజనర్సింహ గారు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, గడ్డం వివేక్ వెంకటస్వామి గారితో పాటు ఉన్నతాధికారులు, రెస్క్యూ బృందాలతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం అక్కడే ఉన్నతస్థాయి సమావేశంలో పరిస్థితిని సమీక్షించారు.

ప్రమాదంపై ప్రాథమిక అంచనా కాకుండా నిపుణులతో అధ్యయనం చేయించి సమగ్ర నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం పలువురు బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆ కుటుంబాలను ఆదుకోవడంతో పాటు తదుపరి తీసుకోవలసిన చర్యలపై అక్కడికక్కడే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మృతుల కుటుంబాలకు తక్షణ సహాయంగా ఒక లక్ష రూపాయలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున అందించాలని కలెక్టర్ ను ఆదేశించారు.

తర్వాత ముఖ్యమంత్రి గారు మీడియాతో మాట్లాడారు “ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. బాధాకరం. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే నిన్నటి నుంచి మొత్తం యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తూ సహాయక చర్యలు చేపట్టారు. మంత్రులు, పోలీసులు ఉన్నతాధికారులు, ఫైర్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది అంతా శిథిలాల తొలగింపు, ఇతర సహాయక చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.

ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు ఇప్పటివరకు 36 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా కొంతమంది ఆచూకి దొరకలేదు.

కంపెనీలో 143 మంది పనిచేస్తుండగా, వారిలో 58 మంది అధికారులకు టచ్ లోకి వచ్చారు. బీహార్, ఒరిసా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు చెందిన వారూ ఉన్నట్టు గుర్తించారు.

ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకుపోయారా అన్నది పరిశీలిస్తున్నారు.

ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం ఇప్పించాలని ఆదేశించాం.

ఇందులో తీవ్రంగా గాయపడి పని చేసుకోలేని స్థితిలో ఉంటే వారికి 10 లక్షల రూపాయలు, గాయాలపాలై కొంతకాలం పనిచేయలేని వారికి రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తాం.

క్షతగాత్రులకు వైద్య సహాయం, చికిత్సకు అయ్యే మొత్తం ఖర్చు ప్రభుత్వం భరిస్తుంది. బాధితులకు నూటికి నూరు శాతం అండగా ఉంటుంది. వారి పిల్లల చదువుల బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది.

ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. భవిష్యత్తులో ఇలాంటివి జరక్కుండా స్పష్టమైన విధానంతో అవసరమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తాం.

భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరక్కుండా కార్యాచరణ ఉంటుంది. క్రమం తప్పకుండా ఫ్యాక్టరీల్లో తనిఖీలు చేస్తూ, అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు యాజమాన్యాలు పొరపాట్లను ఎప్పటికప్పుడు సరిదిద్దుకోవాలి.” అని చెప్పారు.

అనంతరం ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న బాధితులను ముఖ్యమంత్రి గారు పరామర్శించారు.

Related posts