ఖలిస్థాన్ మద్దతుదారులు, లండన్‌లోని భారత హై కమిషనర్ కార్యాలయం ఎదుట ఎన్ఆర్ఐలపై దాడికి పాల్పడ్డారు. భారత్‌లో మైనారిటీ వర్గాలపై వివక్షను నిరసిస్తూ ఆందోళన చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నిరసనలో భాగంగా.. ఓ వర్గం మోదీకి మద్దతుగా నినాదాలు చేయడంతో ఆగ్రహానికి గురైన ఖలిస్థాన్ వర్గీయులు వారిపై దాడికి దిగారు. ఈ ఘటనలో అక్కడి పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని తర్వాత విడిచిపెట్టినట్లు సమాచారం.
గతంలో అనేక సార్లు, పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ మద్దతుతో ఖలిస్థాన్ మద్దతుదారులు భారతీయులపై దాడులు చేశారు. ప్రస్తుతం జరిగిన దాడికి కూడా ఐఎస్ఐ మద్దతు ఉన్నట్లు సమాచారం. పుల్వామా దాడి తరవాత పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా బ్రిటన్‌లోని భారతీయులు అనేక సార్లు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఆ సమయంలోనూ ఖలిస్థాన్ మద్దతుదారులు వారిపై దాడికి తెగబడ్డారు.

