తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక, బహుజన బిడ్డ, చిట్యాల (చాకలి) ఐలమ్మ. నేడు సెప్టెంబర్ 26న ఐలమ్మ జయంతి . ఆధిపత్య, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా ఆత్మగౌరవ పోరాట రణనినాదం ఇచ్చింది ఆమె. గడీల నుంచి దొరలను ఉరికించి తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడింది. తెలంగాణ పౌరుషాన్ని, పోరాటాన్ని త్యాగాన్ని భావితరాలకు అందించి ఉద్యమస్ఫూర్తిని రగిల్చింది.
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం గ్రామగ్రామానా సాగింది. భూస్వాముల దోపిడీపై, రజాకార్ల అరాచకాలపై సామాన్యప్రజానీకం ఉవ్వెత్తున ఎగిసిన కాలమది. అందులోభాగంగా ఆంధ్ర మహాసభ, గుత్పల సంఘం నడిపిన ఉద్యమంలో ఐలమ్మ ముందువరుసలో ఉండి పోరాడారు. కడవెండి, భైరాన్పల్లి, కూటిగల్లు, ధర్మపురం, విసునూరు, మొండ్రాయి, గుండాల, దేవరుప్పుల, నర్మెట్ట, గొలనుకొండ, కామారెడ్డి గూడెంలలో సాగిన రైతాంగ పోరాటానికి వెన్నుదన్నుగా ఆ వీరవనిత నిలిచారు.
1895 సెప్టెంబర్ 26న వరంగల్ జిల్లా, రాయపర్తి మండలం కిష్టాపురం గ్రామంలో ఓరుగంటి మల్లమ్మ-సాయిలు దంపతులకు నాల్గవ సంతానంగా ఐలమ్మ జన్మించింది. పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో ఆమెకు వివాహం జరిగింది. వీరికి ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం. కులవృత్తే వారికి జీవనాధారం. దాంతోపాటు కౌలు వ్యవసాయం కూడా చేసేవారు. పాలకుర్తికి పక్కనే ఉన్న మల్లంపల్లి దొర కుటుంబానికి చెందిన ఉత్తంరాజు జయప్రదాదేవి వద్ద భూమిని చాకలి ఐలమ్మ కుటుంబం కౌలుకు తీసుకున్నది. విస్నూరు దేశ్ముఖ్ రాపాక రామచంద్రారెడ్డికి ఇది కంటగింపైంది.
ఆ సమయంలోనే వెట్టిచాకిరి చేయవద్దని ఆంధ్రమహాసభ ప్రజలకు పిలుపునిచ్చింది. ఆ సంస్థను నాటి ప్రజానీకం సంగం (సంఘం) అని పిల్చుకునేవాళ్లు. భూస్వామితో ఘర్షణ మొదలైన నేపథ్యంలో సంగంలో చేరింది ఐలమ్మ. 1940-44 మధ్యకాలంలో విస్నూర్ దేశ్ముఖ్లు, రజాకార్ల అరాచకాలపై ఆమె ఎదురుతిరిగారు. కష్టజీవులను చేరదీసి భూస్వాముల కట్టుబాట్లను సవాల్ చేశారు. ఆడది ముందుబడి తన ఆధిపత్యాన్ని వెనుకబడేసిందని రామచంద్రారెడ్డి రగిలిపోయాడు. ఐలమ్మపై కక్ష పెంచుకున్నాడు. ఆమె కుటుంబం కౌలుకు తీసుకున్న భూమిలో కాపుకొచ్చిన పంటను కాజేయాలని పన్నాగం పన్నాడు. గూండాలను పురమాయించాడు. వారి కుట్రలను ఐలమ్మ తీవ్రంగా ప్రతిఘటించింది.
‘ఈ భూమి నాది, పండించిన పంట నాది, తీసుకెళ్లడానికి దొరెవ్వడు. నా ప్రాణం పోయాకే ఈ పంట, భూమి మీరు దక్కించుకోగలరం’టూ ఆమె తేల్చిచెప్పింది. ఐలమ్మ భూ పోరాట క్రమంలో పాలకుర్తి దొర ఇంటిపై కమ్యూనిస్టులు దాడిచేసి ఆ ఇంట్లో ఉన్న ధాన్యాన్ని ప్రజలకు పంచారు. అతడికి చెందిన 90 ఎకరాల భూమిని కూడా ప్రజలకు పంచారు. చాకలి ఐలమ్మ తెగువ జనానికి ప్రేరణ, స్ఫూర్తినిచ్చింది. పల్లెపల్లెన ఉద్యమం ఎగిసిపడి, దొరల ఆధిపత్యం నేలమట్టమైంది. తెలంగాణలో 10 లక్షల ఎకరాల భూమి పంపకం జరిగింది. నైజాం వ్యతిరేక పోరాటానికి గొప్ప స్ఫూర్తిగా నిలిచిన చాకలి ఐలమ్మ అనారోగ్యంతో 1985 సెప్టెంబర్ 10న తుదిశ్వాస విడిచారు.
ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకోవాలి: కేటీఆర్