telugu navyamedia
తెలంగాణ వార్తలు

నాటకాలు ఆపి.. కొంటారా? కొనరా?

తెలంగాణలో కష్టాల్లో ఉన్న రైతులకు పాలకుల ఓదార్పు కరువైందని కాంగ్రెస్ పార్టీ ఆవేదన వ్యక్తంచేసింది. ఖరీఫ్ లో దిగుబడులను కొనుగోలుచేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి, పొన్నంప్రభాకర్ మండిపడ్డారు. ధాన్యంకొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర వాగ్వాదాలను పక్కనబెట్టి డిసెంబరు 15 తేదీలోపు సముచి నిర్ణయం తీసుకోకుంటే… కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండలకేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

కేంద్రప్రభుత్వం ఉన్నతాశయంతో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థను నెలకొల్పి రైతులనుంచి ధాన్యం సేకరిస్తుంటే… ఎన్నడూ లేని విధంగా రాష్ట్రప్రభుత్వం కేంద్రప్రభుత్వంపై కయ్యానికి కాలుదువ్వుతోందని విమర్శించారు. ఫ్ సి ఐ ఏర్పడి 66 సంవత్సరాలు ఏర్పడినా ఎన్నడూ కూడా ఇటువంటి విపత్కర పరిస్థితి రాలేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అన్యాయం చేయకుండా కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సాఫీగా ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలుచేయాలని సూచించారు.

కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. పండించుకున్న పంటను వానకు తడిచి, పాడైన ధాన్యాన్ని చూసి రైతులు కుమిలిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఖరీఫ్ సీజన్ లో దిగుబడి ధాన్యాన్ని కొనుగోలుచేయని రాష్ట్రప్రభుత్వం రబీసీజన్ లో పండించబోయే పంటను కొనాలని కేంద్ర ప్రభుత్వంతో అర్థరహితంగా పోట్లాడుతోందన్నారు. తెలంగాణలో రైతులనుంచి ధాన్యం కొనుగోలుకు కేసీఆర్ సర్కార్ చర్యలు తీసుకోవాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

దేశంలో ఎన్నడూ లేనివిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గొడవలకు దిగి రైతులను అన్యాయం చేస్తున్నాయని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా… రాష్ట్ర ప్రభుత్వాలతో సఖ్యతతో వ్యవహరించి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రైతులనుంచి ధాన్యం కొనుగోలుచేసేదని పేర్కొన్నారు. కళ్లాల్లో రైతులు తడిచిన ధాన్యంతో నానా ఇబ్బందులు పడుతుంటే… వాళ్లలో మానసిక స్థయిర్యాన్ని పెంపొందించాల్సిన పాలకులు పంతానికిపోయి మరింత కుంగదీస్తున్నారని మండిపడ్డారు. రైతుల్ని అన్యాయంచేసే పాలకులకు పుట్టగతులుండవన్నారు.

Related posts