telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

27వ రోజుకు చేరిన రైతుల చేపట్టిన ఆందోళన…

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల చేపట్టిన ఆందోళన 27వ రోజుకు చేరింది. చలిని సైతం లెక్క చేయకుండా తమ ఆందోళన కొనసాగిస్తున్నారు అన్నదాతలు. ఆందోళన ఉధృతం చేయాలని నిర్ణయించిన రైతులు… రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. మరోవైపు… రైతుల ఆందోళనలతో ఢిల్లీ సరిహద్దులు మూతపడ్డాయి. రైతులు పట్టు వీడడం లేదు… కేంద్రం మెట్టు దిగడం లేదు. దీంతో వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళన విషయంలో ప్రతిష్ఠంభణ కొనసాగుతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాల్లో పలు లోపాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. వాటిని  రద్దు చేసే వరకూ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు అన్నదాతలు. రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం పలు సార్లు చర్చలు జరిపినా… ఫలప్రదం కాలేదు. రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న అంశాల్లో ఒకటైన కనీస మద్దతు ధరపై సందేహాలు అక్కర్లేదని కేంద్రం చెబుతోంది. MSP యథావిధిగా కొనసాగుతుందని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇప్పటికే చెప్పారు. అలాగే, రైతు సంఘాల ప్రతినిధులతో పలు దఫాలు జరిగిన చర్చల్లో భాగంగా చట్టాల్లో కొన్ని సవరణలు చేయడానికి కేంద్రం ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. అయితే… కొత్త చట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిందేనంటున్నారు రైతులు.  రోడ్లపైనే తింటూ… గుడారాల్లో గడుపుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు.  ఎముకల్ని కొరికే చలిని కూడా లెక్కచేయకుండా తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. గడిచిన 26 రోజుల్లో 21 మంది మరణించారు.

Related posts