ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య విద్యార్థులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 460 అదనపు ఎంబీబీఎస్ సీట్లు మంజూరయ్యాయి. ఇంత పెద్ద మొత్తంలో సీట్లు పెంచడం ఇదే తొలిసారని అధికారులు అంటున్నారు. ఈ సీట్ల భర్తీ, ప్రస్తుతం జరుగుతున్న కౌన్సిలింగ్ నుంచే అమల్లోకి వస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.
అనంతపురం వైద్యకళాశాలలో 50, శ్రీకాకుళం రిమ్స్ లో 50 సీట్లు పెరుగగా, మిగతా 360 సీట్లు ఎకనామికల్లీ బ్యాక్ వర్డ్ క్లాసెస్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు -ఈడబ్ల్యూఎస్) కోటా కింద మంజూరయ్యాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ మెడిసిన్ సీట్లు 1,900 వరకూ ఉండగా, కొత్తగా అనంతపురం, శ్రీకాకుళం సీట్లతో కలిపి ఇవి 2 వేలకు చేరాయి. ఇక ఈడబ్ల్యూఎస్ కోటాను కూడా కలిపితే, ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2,360కి చేరనుంది.

