telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

ఆంధ్రా యూనివర్సిటీ కి .. ఉపకులపతిగా .. పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి..

prasadreddy as VC to Andhrauniversity

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత వీసీ ఆచార్య నాగేశ్వరరావు పదవీకాలం నిన్నటితో ముగిసింది. ప్రసాదరెడ్డి కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా 1987లో పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం సీనియర్‌ ఆచార్యులుగా ఏయూలో సేవలందిస్తున్నారు. 2008-11 మధ్యకాలంలో రిజిస్ట్రార్‌గా, 2011-12లో వర్సిటీ రెక్టార్‌గా, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వహించారు. 2011లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఆచార్యునిగా అవార్డు అందించి గౌరవించింది.

ఈ నియామకంలో ప్రభుత్వం కొత్త సంస్కృతి; పదవి ఖాళీ అయితే కొత్త వ్యక్తిని నియమించేవరకు రెక్టార్‌నో, రిజిస్ట్రార్‌నో, ఇతర విశ్వవిద్యాలయాల వీసీలనో అదనపు బాధ్యతలతో నియమించే సంస్కృతికి తెరదించి, నేరుగా ఆచార్యుడికే ఆ బాధ్యతలు అప్పగించింది. వర్సిటీ 93 ఏళ్ల చరిత్రలో ఇలా చేయడం ఇదే తొలిసారి. ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డికి ఈ అవకాశం వస్తుందని ఎవరూ ఊహించలేదు. వర్సిటీలో రిజిస్ట్రార్‌, రెక్టార్‌గా, వీసీగా మూడు పోస్టుల్లోనూ కొనసాగిన ఆచార్యులు వర్సిటీ చరిత్రలో గతంలో ఎవరూ లేకపోవడం మరో విశేషం. సెర్చి కమిటీ ఏర్పాటు చేసిన అనంతరం ఆయన్ను పూర్తిస్థాయి వీసీగా నియమిస్తారా? లేదా? అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం మధ్యాహ్నం 1.20 గంటల నుంచి వీసీ ఛాంబర్‌ నుంచి బాధ్యతలను నిర్వహిస్తారు.

రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనూ ఆచార్య ప్రసాదరెడ్డి కీలకపాత్ర పోషించారు. విశాఖలో ఐ.టి.రంగం అభివృద్ధి కావడానికి వీలుగా తన వంతు కృషి చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్న డిమాండుతో జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తరువాత కూడా పలుమార్లు ఆయన్ను కలిసి వివిధ అంశాలపై తన ఆలోచనలను పంచుకున్నారు. విజయవాడలో ఉన్న ఆచార్య ప్రసాదరెడ్డి తాను బాధ్యతలు స్వీకరిస్తున్నట్లుగా ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జె.ఎస్‌.వి.ప్రసాద్‌కు లేఖ అందజేశారు.

Related posts