telugu navyamedia
ట్రెండింగ్ విద్యా వార్తలు సాంకేతిక

5జి లో పీజీ డిప్లమా అందిస్తున్న .. బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ..

BSNL free internet landline

రోజురోజుకు టెక్నాలజీ లో పెనుమార్పులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తగిన సంబంధిత నైపుణ్యాలున్నవారు లేరు. 3జీ, 4జీలు వచ్చిన నేపథ్యంలోనే నిపుణులకు ఇంత గిరాకీ ఉంటే.. 5జీ అందుబాటులోకి వస్తే ఈ పరిస్థితి మరింత పెరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు భారీగా ఉన్నా నిరుద్యోగులకు అవగాహన, తగిన శిక్షణ లేక వీటిని అందిపుచ్చుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో బీఎస్సీ లేదా ఇంజినీరింగ్‌ చేసినవారికి పీజీ డిప్లొమాను అందించటానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ నిర్ణయించింది. హెచ్‌సీయూ (హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం)తో ఒప్పందం చేసుకొంది. దూరవిద్య ద్వారా అందించే ఈ కోర్సు పూర్తి చేసినవారు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు దక్కించుకునే అవకాశం ఉంటుంది.

పీజీ డిప్లొమా ఇన్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులో టెక్నాలజీ, ఫైనాన్స్‌, మార్కెటింగ్‌, కస్టమర్‌ రిలేషన్స్‌ అంశాలుంటాయి. దేశవ్యాప్తంగా ఇలాంటి కోర్సు ఇప్పటివరకూ మరే విశ్వవిద్యాలయం రూపొందించలేదు. 5జీ వస్తున్న నేపథ్యంలో టెలికాంలో రానున్న నిపుణుల కొరతను దృష్టిలోపెట్టుకొని పట్టాలెక్కుతున్న కోర్సు ఇది. ప్రయోగాత్మకంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ దీన్ని రూపొందించింది.

టెలికాం రంగంలో ఉన్న అవకాశాల దృష్ట్యా అదనపు అర్హతగా పీజీ డిప్లమో కోర్సు ఉపయోగపడుతుంది. ఇప్పటికే చిన్న ఉద్యోగాల్లో చేరిన వారికి కూడా ఈ కోర్సు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. దూరవిద్య ద్వారా అందిస్తున్న ఈ కోర్సుకు వారాంతాల్లో (శని, ఆది) తరగతులు నిర్వహిస్తారు. మిగతా రోజుల్లో పాఠ్యాంశాలకు సంబంధించిన మెటీరియల్‌ ఇస్తారు. ఖాళీ సమయాల్లో వీటిని చదువుకోవాల్సి ఉంటుంది. సెమిస్టర్‌ విధానంలో ఏడాదిలో రెండుసార్లు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. వీటితోపాటు ప్రయోగ పరీక్షలు ఉంటాయి. వీటిల్లో ఉత్తీర్ణత సాధిస్తే హెచ్‌సీయూ గుర్తింపుతో పట్టా వస్తుంది. ఈ కోర్సు పూర్తి చేసేనాటికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన పలు సంస్థలు ప్రాంగణ ఎంపికలు నిర్వహించే అవకాశం ఉండచ్చని నిర్వాహకులు వివరిస్తున్నారు.

ముఖ్యాంశాలు :

* పీజీ డిప్లమో ఇన్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌-2019 (పీజీడీటీటీఎం)
* దూరవిద్య విధానంలో తరగతులు నిర్వహిస్తారు.
* ప్రతి ఆరు నెలలకు పరీక్షలు ఉంటాయి.
* ప్రతి సెమిస్టర్‌కు రూ.20 వేల ఫీజు
* హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని రీజనల్‌ టెలీకం ట్రైనింగ్‌ సెంటర్‌ (ఆర్‌టీటీసీ)లో తరగతులు
* హైదరాబాద్‌ నాంపల్లిలోని హెచ్‌సీయూ దూరవిద్యకేంద్రంలో జూన్‌, డిసెంబరుల్లో 6 రోజులు పరీక్షలు ఉంటాయి. 4 రోజులు ప్రయోగపరీక్షలు నిర్వహిస్తారు.

దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 28, 2019
కోర్సు కాలం: ఏడాది

అర్హతలు: బీఎస్సీ (ఫిజిక్స్‌, మేథ్స్‌), బీటెక్‌.
వెబ్‌సైట్‌: www.natfm.bsnl.co.in

Related posts