ప్రముఖ టిక్‌టాక్ స్టార్, డ్యాన్సర్ సియా కక్కర్ గురువారం (జూన్ 25న) ఢిల్లీలో ఆత్మహత్య చేసుకుంది. ఆమె వయసు 16 సంవత్సరాలు. సియా మరణ వార్తను ఆమె మేనేజర్ అర్జున్ సారిన్ ఖరారు చేశారు. సియా మృతి పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘సియా ఆత్మహత్య వెనుక ఆమె వ్యక్తిగత కారణాలు ఏవో ఉన్నాయి. కెరీర్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. ఆమె తన పనిని ఎంతో బాగా చేసుకుంటోంది. ఒక కొత్త ప్రాజెక్ట్ గురించి ఆమెతో రాత్రి నేను మాట్లాడాను. ఆమె కూడా నాతో బాగానే మాట్లాడింది. నేను, మా కంపెనీ ఫేమ్ ఎక్స్‌పర్ట్స్ ఎంతో మంది ఆర్టిస్ట్‌లను మేనేజ్ చేస్తున్నాం. సియా వద్ద అద్భుతమైన టాలెంట్ ఉంది. ప్రస్తుతం నేను ప్రీత్ విహార్‌లోని సియా ఇంటికి వెళ్తున్నాను’’ అని అర్జున్ సారిన్ వెల్లడించారు. కాగా, సియాకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, యూట్యూబ్ వంటి అన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలలోనూ సియా యాక్టివ్‌గా ఉండేది. తన డ్యాన్స్ వీడియోలను ఈ ప్లాట్‌ఫాంలలో పోస్ట్ చేస్తూ ఉండేది. టిక్‌టాక్‌లో సియాకు 1.1 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. సియా ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు. సియా ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు. కేసు నమోదుచేసుకున్న ఢిల్లీ పోలీసులు విచారణ చేపట్టారు.
next post