telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సినీ ప్రయాణంలో … దశకం పూర్తిచేసుకున్న.. శ్రుతి .. ఇంకా శ్రమిస్తుందట..

Shruti-Hassan

నటి శ్రుతి హాసన్‌ ఇన్నేళ్లూ తనను అభిమానించి, ఆదరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. 2009లో హిందీ సినిమా ‘లక్‌’ తో ఆమె నటిగా అరంగేట్రం చేశారు. ఈ చిత్రం జులై 24న విడుదలైంది. ఈ నేపథ్యంలో ఆమె చిత్ర పరిశ్రమకు వచ్చి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు చెప్పారు. ప్రత్యేక పోస్టర్‌ను డిజైన్‌ చేసి షేర్‌ చేశారు. వీరికి నటి ట్విటర్‌ వేదికగా థాంక్స్‌ చెబుతూ.. ఓ ప్రకటన విడుదల చేశారు. నేటితో చిత్ర పరిశ్రమలో నటిగా పదేళ్లు పూర్తి చేసుకున్నాను. ఈ ప్రయాణంలో ఎన్నో నేర్చుకున్నాను. నన్ను ఇన్నాళ్లూ ఆదరించినందుకు సంతోషంగా ఉంది, కృతజ్ఞురాల్ని. మరింత కష్టపడి పనిచేస్తానని మీకు ప్రామిస్‌ చేస్తున్నా. నన్ను ఆదరించిన మీరు గర్వపడేలా చేస్తాను.

ఈ చిత్ర పరిశ్రమ ఓ కుటుంబంలాంటిదని అర్థమైంది. ఇక్కడ మంచి ఉంది, చెడూ ఉంది. అన్నింటికన్నా మించి ఇక్కడ మనల్ని మనం నిరూపించుకుని, వృద్ధి చెందొచ్చు. ఈ పదేళ్ల ప్రయాణంలో నేను నటిగా, వ్యక్తిగా చాలా మారాను. ఏడాదిపాటు బ్రేక్‌ తీసుకుని నా వృత్తిపరమైన, వ్యక్తిగత లక్ష్యాల్ని నిర్ధేశించుకున్నాను. ఎటు వైపు పయణించాలో నిర్ణయించుకోవడానికి ఈ విరామం నాకు చాలా తోడ్పడింది. నాపై నమ్మకం ఉంచి, సపోర్ట్‌ చేసిన వారికి నా ప్రేమను పంపుతున్నాను. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.. అని శ్రుతి ఓ పోస్ట్‌ చేశారు. ఈ భామ 2017లో ‘కాటమరాయుడు’ తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్‌ ఇచ్చారు. మ్యూజిక్‌ ఆల్బమ్‌లు, షోలతో బిజీగా గడిపారు. తిరిగి ఈ ఏడాది తమిళంలో హీరో విజయ్‌ సేతుపతి సినిమాకు సంతకం చేశారు. ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

Related posts