పెళ్లి పేరుతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు గాలమేసిన కోటి రూపాయలతో ఓ యువతి ఉడాయించింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వసంతనగర్‌కు చెందిన ఉప్పలపాటి చైతన్య విహారి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. పెళ్లి సంబంధాల కోసం వెతుకున్న ఆయనకు ఓ పెళ్లి సంబంధాల సైట్‌లో మాగంటి అనుపల్లవి పేరుతో ఓ మహిళ పరిచయమైంది. తనది జూబ్లీహిల్స్ అని, వైద్యురాలినని చెప్పి నమ్మించింది. నెమ్మదిగా పరిచయం పెరిగాక తన పథకాన్ని అమలు చేసింది.
తల్లిదండ్రుల నుంచి తనకు కోట్లాది రూపాయల ఆస్తులు రావాల్సి ఉందని, కానీ వాటిని ఇవ్వనంటున్నారని చెప్పింది. చట్టబద్ధంగా సమస్యను పరిష్కరించుకునేందుకు కోటి రూపాయల వరకు ఖర్చవుతుందని నమ్మబలికింది. ఆమె ఉచ్చులో పడిన చైతన్య రూ.1.02 కోట్లను ఆమె ఖాతాలోకి బదిలీ చేశాడు. డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయిన వెంటనే ఆమె పత్తాలేకుండా పోయింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

