మహేశ్ బాబు హీరోగా, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా జనవరి 11న విడుదలై హిట్ టాక్తో దూసుకుపోతోంది. బాక్సాఫీసు వద్ద కాసులు వర్షం కురిపిస్తోంది. దీంతో చిత్ర యూనిట్ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా విజయోత్సవ వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో గురువారం హీరో మహేశ్ బాబు, లేడీ అమితాబ్ విజయశాంతి, దర్శకులు అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి, నిర్మాతలు దిల్ రాజు, అనిల్ సుంకర, నటుడు రాజేంద్ర ప్రసాద్ తదితరులు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుపతి వెళ్ళారు.
ఈ సందర్భంగా విమానాశ్రయంలో తీసుకున్న ఫొటోను సోషల్ మీడియలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఫొటో వైరల్ అవుతోంది. “సరిలేరు నీకెవ్వరు” విజయాన్ని పురస్కరించుకుని జనవరి 17న (శుక్రవారం) రాత్రి 7:30 గంటలకు వరంగల్ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా విజయోత్సవ వేడుక నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, లేడీ అమితాబ్ విజయశాంతి, దర్శకుడు అనిల్ రావిపూడి, ఈ చిత్ర నిర్మాతలు పాల్గొననున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ , రాములమ్మ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.

