telugu navyamedia
CBN pm modi ఆంధ్ర వార్తలు నరేంద్ర మోదీ రాజకీయ వార్తలు

11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ప్రపంచం నేడు అనేక సంఘర్షణలు, అశాంతి, అస్థిరతతో సతమతమవుతున్న తరుణంలో యోగా శాంతి మార్గాన్ని నిర్దేశిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

విశాఖపట్నంలో ఈ ఉదయం జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ జాతీయ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

ఈ యోగా దినోత్సవం ‘మానవాళి కోసం యోగా 2.0’ కు నాంది పలకాలని, దీని ద్వారా అంతర్గత శాంతి ప్రపంచ విధానంగా మారాలని అంతర్జాతీయ సమాజానికి ఆయన పిలుపునిచ్చారు.

విశాఖలోని ఆర్కే బీచ్‌లో మూడు లక్షల మందికిపైగా ప్రజలతో కలిసి ప్రధాని మోదీ కామన్ యోగా ప్రొటోకాల్ (సీవైపీ)లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆనందం, శాంతిని పెంపొందించడంలో యోగా ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు. ఘర్షణల నుంచి సహకారానికి, ఉద్రిక్తతల నుంచి పరిష్కారానికి ప్రపంచాన్ని నడిపించడం ద్వారా యోగా శాంతిని చేకూర్చగలదని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు.

“దురదృష్టవశాత్తు, నేడు ప్రపంచం మొత్తం ఉద్రిక్తత, అశాంతితో సతమతమవుతోంది. అనేక ప్రాంతాల్లో అస్థిరత పెరుగుతోంది. ఇలాంటి సమయంలో యోగా మనకు శాంతి మార్గాన్ని చూపుతుంది.

మానవాళి శ్వాస తీసుకోవడానికి, సమతుల్యం చేసుకోవడానికి, తిరిగి సంపూర్ణంగా మారడానికి అవసరమైన విరామ బటన్ యోగా” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

యోగా కేవలం వ్యక్తిగత సాధన మాత్రమే కాకుండా, ప్రపంచ భాగస్వామ్యానికి మాధ్యమంగా మారాలని, ప్రతి దేశం, సమాజం యోగాను తమ జీవన విధానంలో, ప్రభుత్వ విధానంలో భాగంగా చేసుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.

11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన, యోగా కేవలం వ్యాయామం కాదని, అదొక జీవన విధానమని అన్నారు.

“యోగా అంటే సరళంగా చెప్పాలంటే కలపడం. ఇది ప్రపంచాన్ని కలిపింది” అని ఆయన తెలిపారు.

Related posts