విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడులు తీసుకురావాలని పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు.
ఈ సదస్సులో గూగుల్‌తో డేటాసెంటర్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు, అలాగే ఏరోస్పేస్ సిటీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ముంబైలో జరిగిన రోడ్‌షోలో మంత్రి లోకేశ్ కీలక విషయాలను వెల్లడించారు.
డేటాసెంటర్ ఏర్పాటు కోసం కేంద్రంతో మాట్లాడి పాలసీలో మార్పులు తెచ్చామని, క్లస్టర్ల వారీగా అభివృద్ధి చేస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని ఆయన వివరించారు.
కియా సంస్థకు ఇచ్చిన ప్రోత్సాహకాలను అనుబంధ పరిశ్రమలకు కూడా అందించి, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని ఫార్చ్యూన్ 500 కంపెనీలు రాష్ట్రం వైపు చూస్తున్నాయన్నారు మంత్రి లోకేష్.
అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిత్తల్ ప్లాంట్ రాబోతోందని వేగవంతమైన వ్యాపార కార్యకలాపాలకు ( స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ఆర్సెలార్ మిత్తల్ ప్లాంటు నిదర్శనమన్నారు.
ఆ కంపెనీకి జూమ్ కాల్‌లోనే అన్ని అనుమతులు మంజూరు చేశామని పేర్కొన్నారు. ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ పనులు ఈ ఏడాది నవంబరు నెలలో ప్రారంభమవుతున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు.