అయోధ్య రామాలయం భూమిపూజలో ప్రధాని హోదాలో మోదీ పాల్గొనడం రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమేనని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఒవైసీ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి జన్మభూమిలో ఆయన మందిర నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో ప్రధాని మోదీపై ఒవైసీ చవకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఒవైసీ వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు.కోట్లాది మంది ఆత్మగౌరవానికి సంబంధించిన కార్యక్రమంలో మోదీ పాల్గొనడం దేశ ప్రజలందరికీ గర్వకారణమని సంజయ్ అన్నారు. 400 ఏళ్లుగా అయోధ్యలో బాబ్రీ మసీదు ఉందనే విషయం నిజమైతే… అక్కడ ఉన్న రామ మందిరాన్ని ఎవరు ధ్వంసం చేశారని ఆయన ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి రామాలయ నిర్మాణం జరుగుతోందని చెప్పారు.

